- గ్రామాభివృద్ది ప్రణాళికల రూపకల్పనకి శ్రీకారం
- ప్రణాళికల్లో వార్షిక లక్ష్యాలతో పాటు 5 సంవత్సరాల సుదీర్ఘ లక్ష్యాలుండాలని అధికారులకి ఆదేశం
- లక్ష్యాల సాధనకి వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు
- తాగునీరు పారిశుద్యం, సహజవనరుల నిర్వహణ, విద్య, అరోగ్యం, వ్యవసాయం, సామాజికభద్రత, గ్రామీణ మౌలికవసతుల నిర్వహణకి ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకి సరికొత్త రూపునిచ్చేందుకు త్వరలోనే గ్రామ పంచాయితీల వారీగా అభివృద్ది ప్రణాళికలను రూపొందించనున్నట్లు పంచాయితీరాజ్ శాఖామంత్రి కే. తారక రామారావు తెలిపారు. గ్రామాభివృద్ది ప్రణాళికల రూపకల్పన కోసం పంచాయితీరాజ్ శాఖ ఇప్పటికే పనిని ప్రారంభించినట్టు తెలిపారు. పద్నాలుగవ అర్ధిక సంఘం మార్గదర్శకాలకి అనుగుణంగా ఈ గ్రామాభివృద్ది ప్రణాళికలుంటాయని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయితీల ప్రాధమిక విధులైన తాగునీరు, దీపాల నిర్వహణ, పారిశుద్యం వంటి అంశాలకి ప్రధాన పీటవేస్తూ, ఆయా అంశాల్లో ఏడాదికాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామాభివృద్ది ప్రణాళికల్లో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలనుంచి వచ్చిన సలహాలు, సూచనలను సమన్వయం చేసుకుంటూ పంచాయితీ స్థాయిలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను ఈ గ్రామాభివృద్ది ప్రణాళికల్లో పొందుపరచనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో వివిధ శాఖల వారీగా చేపట్టనున్న కార్యక్రమాలను ఆయా శాఖలతో కలిసి సమన్వయం చేసుకుంటూ ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రతి పల్లెను గంగదేవపల్లెగా మార్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి కే.తారక రామారావు తెలిపారు. గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రజల భాగసామ్యాన్ని పెంచేలా పలు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, అక్షరాస్యత, హరిత హారం లాంటి కార్యక్రమాల లక్ష్యాలను సంపూర్ణంగా సాధించే గ్రామాలకి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు.
ఈ గ్రామ పంచాయితీలకి వచ్చే పన్నులు, ఇతర ఆదాయాలను సైతం రూపొందించుకుని, కేంద్రం, రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో గ్రామాలను సమగ్రంగా అభివృద్ది చెందేలా ఈ గ్రామాభివృద్ధికి ప్రణాళికలుంటాయన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనతో స్థానిక సంస్ధల నిధులను సరిగ్గా వినియోగించుకునేందుకు వీలు కలుగుతుందని, దుబారా వ్యయం తగ్గుతుందన్నారు. ఈ గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపకల్పన కోసం పంచాయితీరాజ్ శాఖ చేపట్టిన పనులను పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ మంత్రి కే. తారక రామారావుకి వివరించారు. పద్నాలుగవ ఆర్ధిక సంఘం సూచించిన గ్రామాభివృద్ది ప్రణాళిక నమూనా కన్నా మరింత మెరుగ్గా తాము రూపొందించబోయే గ్రామాభివృద్ది ప్రణాళికలుంటాయని కమీషనర్ మంత్రి కే. తారక రామారావుకి వివరించారు. గ్రామాభివృద్ది ప్రణాళిక ప్రధానంగా దృష్టిసారించే అంశాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, సహజ వనరుల నిర్వహణ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక భధ్రత, గ్రామీణ మౌలిక వసతుల నిర్వహణ ఉంటాయన్నారు. ఈ అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన హరిత హారం, పించన్లు, మిషన్ కాకతీయ లాంటి పథకాలను గ్రామాల్లో అమలుచేసే తీరుపై గ్రామాభివృద్ది ప్రణాళికల్లో స్పష్టమైన లక్ష్యాలుండాలని మంత్రి అధికారులకి నిర్ధేశించారు.
ఈ ప్రణాళికల్లో వార్షిక లక్ష్యాలతో పాటు 5 సంవత్సరాల సుదీర్ఘ లక్ష్యాలు సైతం ఉండాలన్నారు. ప్రాధాన్యాతాంశాల్లో ప్రజల భాగసామ్యాన్ని మరింతగా పెంచేందుకు కృషి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ గ్రూపుల్లో గ్రామాల్లోని మహిళా సంఘాల ప్రతినిధులతోపాటు రిటైర్డు ఉద్యోగులుంటారని, వీరు అధికారులతో సమన్వయం చేసుకునేందుకు స్వచ్చందంగా పనిచేస్తారని మంత్రి తెలిపారు. గ్రామాభివృద్ది ప్రణాళికల రూపకల్పన పూర్తయిన తర్వాత వీటిని అమలుచేయడం కోసం స్ధానిక సంస్ధల ప్రతినిధులకి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.