రానున్న వేసవిలో వ్యవసాయం, పరిశ్రమలకు కోతలు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చైనా వెనుకాడొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖామంత్రి కే లక్ష్మారెడ్డి, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, తెలంగాణ జెన్కో చైర్మన్ డీ ప్రభాకర్ రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటుందని, దీనిని అధిగమించేందుకు పవర్ ఎక్సేంజి నుండి 4 నుండి 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం స్పందిస్తూ విద్యుత్ కొనుగోలు చేయడానికి కావలసిన అన్ని మార్గాలనూ పరిశీలించమని, వ్యవసాయం, పరిశ్రమల రంగాలపై మాత్రం ఎలాంటి కొరత ప్రభావం ఉండొద్దని సూచించారు. కేరళలోని కాయంకుళం నుండి, తూర్పు(ఈస్టర్న్) పవర్ గ్రిడ్ నుండి విద్యుత్ తెచ్చుకునేందుకు అవసరమైన మార్గాలను పరిశీలించాలన్నారు. సౌర విద్యుత్ పై కూడా దృష్టి కేంద్రీకరించాలని, రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు తగిన పరిస్థితులను అన్వేషించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.