హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అన్నింటికీ హైదరాబాద్ ను కేంద్రం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా, విద్య, సినిమాలకు హైదరాబాద్ ను కేంద్రం చేస్తామని, ఎన్ని సిటీలు వచ్చినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గదని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను స్లమ్ లెస్ సిటీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, నగరంలో భద్రతపై ప్రపంచ దేశాలకు విశ్వాసం కల్పిస్తామని, నాలాలను అభివృద్ధి చేసి తీరుతామని ఈటెల స్పష్టం చేశారు.
ఛత్తీస్ గడ్ ప్రభుత్వంతో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, అనుకున్న సమయానికి ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. జెన్కో ఆధ్వర్యంలో 6 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టనున్నట్లు, విద్యుత్ లైన్లు వేసేది కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థ మాత్రమేనని, దీనికోసం డిచ్ పల్లి వద్ద 60 ఎకరాలకు స్థలం కేటాయించినట్లు ఈటెల తెలిపారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు.