mt_logo

తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన

శాసనసభ సమావేశాల్లో ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, అమరులు కోరుకున్న బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపకల్పన జరిగిందని, సమగ్ర అవగాహనతోనే రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బడ్జెట్ లో ఎలాంటి అంకెల గారడీ లేదని, రేపటి తరాలకు బంగారు బాట వేసే బడ్జెట్ అని, మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాటలు సుద్ద తప్పు అని ఈటెల స్పష్టం చేశారు.

తెలంగాణ ఆవేదనను చూసి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చలించిపోయారని, తెలంగాణకు రూ. 67 కోట్లను అప్పుగా చూపించిందని చెప్పారు. రెవెన్యూ మిగులును రూ. 301 కోట్లుగా చూపించామని, అప్పులు లేకుండా అభివృద్ధికి ఆస్కారమే లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించదని, ప్రతి పేదవాడికీ తెల్ల రేషన్ కార్డు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని ఈటెల తెలిపారు.

తెలంగాణ తల్లుల రుణం తీర్చుకునేందుకు ఆసరా పథకం ప్రవేశపెట్టామని, ప్రజలు ఇన్నాళ్ళూ ఏం కోల్పోయారో అవన్నీ అందిస్తామని, దళితులకు ఉపయోగకరమైన భూమినే ఇస్తున్నామని, కరెంట్, వ్యవసాయ పరికరాలు కూడా ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఇంకా ఎన్నాళ్ళు దుఃఖంతో కుంగిపోవాలని, పాలమూరు జిల్లాలో నీటివనరులు ఉన్నప్పటికీ భూములన్నీ బీడువారిపోయాయన్నారు. తమ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఆర్డీఎస్ వరకు పాదయాత్ర చేస్తే అప్పుడు అధికారంలో ఉన్న అరుణక్క రాయలసీమకు హారతి పట్టిందని గుర్తు చేశారు.

పల్లెపల్లెన పల్లెర్లు మొలిచే అనే కన్నీటి పాటలను గతంలో రాసుకున్నామని, కానీ ఇప్పుడు కన్నీటి పాటలకు ఆస్కారం లేదని ఈటెల అన్నారు. పల్లెలకు పోయి పండుగ చేసుకుంటామనే పాటలు రాస్తాం అని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *