mt_logo

ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తున్నారు: బీఆర్ఎస్ నేత క్రిశాంక్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నిన్న పోలీసులు తన ఫోన్ సీజ్ చేయడాన్ని ఖండిస్తూ.. నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే నాపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్రపురి కాలనీలో రూ. మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. నాకు పోలీసులు నోటీసులు ఇచ్చి నా మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారు అని అన్నారు.

చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానంద రెడ్డి ఎవరో తెలియదని సీఎం అంటున్నారు. మహానందరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు వున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామా.. మేము అణిచివేస్తే రేవంత్ రెడ్డి రాజకీయాలు చేసేవారా అని ప్రశ్నించారు.

నాపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తా.. చట్ట ప్రకారం ఫోన్లను జప్తు చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు వుంది. జ్యుడీషియల్ వారెంట్ వుంటేనే ఫోన్లు జప్తు చేయాలి. చిత్రపురిలో మూడు వేల కోట్ల కుంభకోణంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయలేదా అని క్రిశాంక్ పేర్కొన్నారు.

ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని గుర్తుకు తెస్తున్నారు. గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారు. మా ఫోన్లతో పాటు పీఏ, పీఆర్ఓల ఫోన్లను సైతం తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ కవిత కేసు విషయంలో ఫోన్లను తీసుకున్నారు అని గుర్తు చేశారు.

నా ఫోన్‌ను మాదాపూర్ పోలీసులు కోర్టుకు అప్పగించాలి. నా ఫోన్ పోలీసుల దగ్గర వుందా.. లేక రేవంత్ రెడ్డి దగ్గర ఉందా అనే అనుమానం వస్తోంది.. డాటా గోప్యతపై సుప్రీం కోర్టు గతంలో అనేక తీర్పులు ఇచ్చింది. వాటి ఆధారంగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం అని స్పష్టం చేశారు.