సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెలాఖరు కల్లా ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిసి ఎంసెట్ కౌన్సిలింగ్ కు సంబంధించి చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణలో ప్రత్యేక కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రవేశాల నిర్వహణ కోసమే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, దీనిద్వారానే తెలంగాణలో కౌన్సిలింగ్ జరుగుతుందని సుప్రీంకోర్టుకు తెలియజేశామని, వివిధ కారణాల వల్ల జూలై 31 కల్లా పూర్తి కావాల్సిన కౌన్సిలింగ్ ను అక్టోబర్ నెలాఖరు వరకు పొడిగించమని కోర్టును కోరామని, సుప్రీంకోర్టు స్పందించి ఆగస్టు 31 వరకు గడువు పొడిగించిందని వివరించారు.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 75 ప్రకారమే ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ఈ తీర్పులో 1956 స్థానికత, ఫాస్ట్ పథకానికి సంబంధించి ఎక్కడా ప్రస్తావించలేదని, దీంతో సొంతంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించుకోవడానికి అనుకూలత లభించినట్లు అయిందని పాపిరెడ్డి తెలిపారు. ఈనెల 14 లేదా 15వ తేదీ నుండి ప్రారంభించి ఈ నెల 23నాటికల్లా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో తెలంగాణ పిల్లలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.