రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తున్నది. వారం రోజుల నుండీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం CEC కి తెలియపరుస్తున్నది. ప్రస్తుతానికి వున్న సమాచారం ప్రకారం నవంబర్ లోనే ఎన్నికల ప్రక్రియ ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపై పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు CEC ప్రతినిధి బృందం రాష్ట్రానికి మంగళవారం వస్తున్నదని రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కొరకు Rs. 308 కోట్ల బడ్జెట్ ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు చెప్పారు. మరో వారంలో రాష్ట్రానికి కొత్తగా 44 వేల వీవీ ప్యాట్లు, 40,000 వేల కంట్రోల్ యూనిట్లు, 52 వేల బ్యాలెట్ యూనిట్లు వస్తున్నాయని తెలిపారు.
వీవీ ప్యాట్లు పనిచేసే విధానం, ఓటు వేసినప్పుడు రసీదు ఎలా వస్తుంది అనే విషయాలపై రాజకీయ పక్షాలకు వివరంగా చెబుతామని చెప్పారు. ఇప్పటికే ఒక జాయింట్ సిఈఓను, ఇద్దరు డిప్యూటీ సిఈఓలను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. మరొక ఐటీ నిపుణుడు పోలీసు శాఖకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుసంధాన కర్తగా నోడల్ ఆఫీసర్ కూడా అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి తాము ప్రతిపాదించినట్లు రజత్ కుమార్ తెలిపారు.
మంగళవారం రాష్ట్రానికి రానున్న ప్రతినిధి బృందం, గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీలతో సాయంత్రం 6.30 నిమిషాలకు భేటీ అవుతున్నట్లు తెలిపింది. బుధవారం ఉదయం నుండీ సాయంత్రం వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర బృందం సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు.