mt_logo

కాళోజీ కవి అస్తమించని రవి

కాళోజీ (నారాయణ రావు) చివరి శ్వాస పీల్చి పదహారేండ్లయింది. ఇక ఆయన మన మధ్య లేరని ఆయన అభిమానులందరూ విచారించారు, విలపించారు. ఆ రోజు (2002 నవంబర్ 13) రెండు పత్రికల వారు ఆయనపై సంపాదకీయాలు కావాలన్నారు. కేసీఆర్ నాయకత్వాన టీఆర్‌ఎస్ అపూర్వ ఉత్సాహంతో, తకుముందెన్నడూ లేని పటిష్ట రాజకీయ వ్యూహంతో, అచంచల విశ్వాసంతో అవతరించి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి (అప్పటివరకు పలు దశల్లో అప్పటి నాయకుల, భ్రష్ట పాలకుల కల్లిబొల్లి కబుర్లతో, పచ్చి మోసాలతో, దగాలతో, భంగపడిన వాగ్దానాలతో, పని చేయని కమిటీలతో జీవచ్ఛవంగా మిగిలిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి) పునర్జన్మ ప్రసాదించిన రోజులలో కాళోజీ అంతిమయాత్ర జరిపారు. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము జూచి కరగిపోవును గుండె, మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు, పతిత మానవు జూచి చితికిపోవును మనసు..తప్పు దిద్దగ లేను దారిజూపగలేను, తప్పుచేసిన వాని దండింపగా లేను, కష్టపడు వారలను కాపాడగా లేను…

తన కల ఫలించకుండానే, తన గమ్యం చేరకుండానే, తన జీవితాశయం నెరవేరకుండానే కాళోజీ పరమపదించారని అనేకులు, అసంఖ్యాకులు చింతించారు. తెలంగాణదే విజయం, తుదకు వచ్చి తీరు తెలంగాణ అని 1969లోనే కాళోజీ తెలంగాణ జనకోటి పక్షాన కాహళి పట్టి, గళమెత్తి ప్రకటించారు. కోట్లాది తెలంగాణ ప్రజల ప్రగాఢ వాంఛ, తెలంగాణ ప్రజల నిరంతర, నిర్విరామ ప్రజాస్వామ్య పోరాటంలోని అపార బలం అన్నీ తెలిసిన ఆశావాది, తెలంగాణ ప్రజల మహోన్నత ఉద్యమానికి తన కలాన్ని అంకితం చేసిన మహాకవి, ప్రజాకవి ఒక ద్రష్టగా, స్రష్టగా చేసిన ఈ మహత్తర ప్రకటన సహజమైనది. కాళోజీ కవీశ్వరుని ప్రకటన వమ్ముగాకుండా కంకణధారణ చేసి ఏండ్లుగా ఉద్యమానికి నాయకత్వం, సారథ్యం వహించి తెలంగాణ రాష్ట్రం సాధించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్, ఆ ఘనత నిశ్చయంగా ఆయనదే. ఆ రోజు రెండు పత్రికలకు రాసిన రెండు సంపాదకీయాల్లో నేను దృఢ విశ్వాసంతో వ్యక్తపరిచిన ఆశాభావం ఒక్కటే.. సత్వర భవిష్యత్తులో అవతరించనున్న తెలంగాణ రాష్ట్రం ప్రజాకవి కాళోజీకి సజీవ స్మృతి చిహ్నం కాగలదన్నది ఆ ఆశాభావం. కాళోజీ కవి శతజయంతి సంవత్సరంలోనే (2014) తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కాళోజీ కలలకు, ఆయన సమతా సిద్ధాంతాలకు, సామ్యవాద భావాలకు అనుగుణంగా గత నాలుగేండ్ల మూడు నెలల నుంచి తెలంగాణ సర్వజన ప్రగతి, సకలజన సంక్షేమం సమున్నత, ఉదాత్త ఆశయాలుగా నిరుపమాన కృషి కొనసాగుతున్నది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ, తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అనేక అవరోధాలను అధిగమిస్తూ కొనసాగిస్తున్న తపస్సు కాళోజీ కవి ఆత్మకు శాంతి కలిగిస్తుందని అనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలూ తపించిన, పరితపించిన, వేదన చెందిన, విలపించిన కవి పుంగవుడు కాళోజీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ వేదికపై కూర్చోవడానికైనా, ఎవరితో భుజం కలుపడానికైనా వెనుకాడని ఉద్యమకారుడు, ప్రతిఘటన ప్రచండుడు, తెలంగాణ భాషలో పరుష వాక్య ప్రయోగ చతురుడు కాళోజీ. తెలంగాణ కవి సూర్యుడు కాళోజీ అస్తమయం లేనివాడు. ఆత్మాభిమానం తప్ప ఆత్మవంచనకు తన జీవిత నిఘంటువులో స్థానం ఇవ్వని ఏకైక తెలంగాణ కవి, ప్రపంచకవి, ప్రజాస్వామ్య కవి, మానవాళి కవి మన కాళోజీ…మాజీ స్వాతంత్య్ర సమరయోధుడైన కాళోజీ బేజారై అడుగుతాండు రాష్ట్రపతీ ఏమంటవు? అంటూ నిటారుగా నిలిచి, నిలదీసి ఎవరినైనా సూటిగా ప్రశ్నించగలిగిన శబ్దశాసనుడు, అక్షర సాహసవంతుడు, అక్షయ మనోబల సంపన్నుడు కాళోజీ…ఆంధ్ర-తెలంగాణ వేరు రాష్ట్రాలై రాణిస్తాయి అని ఎన్నడో, నిరాశావాదులు పిరికి మందు నూరిపోస్తున్న రోజుల్లో భవిష్యవాణి వినిపించిన ప్రవక్త ఆయన.

కాళోజీ ప్రతి పదంలో, ప్రతి వాక్యంలో నాటి రాచరిక నిరంకుశ పాలకులకు, మతోన్మాద ముష్కరులకు, మానవత్వ రహితులకు విప్లవ నాదాలు వినిపించాయి, ప్రతిఘటన ప్రభంజనాలు కనిపించాయి, వణికించాయి. రాచరిక పాలకులు కాళోజీ కవిని కొంతకాలం ఆయన స్వస్థలం వరంగల్ నగరం నుంచి బహిష్కరించారు. బహిష్కరణకు గురైనా ఆయన తన ప్రజల హృదయాలకు దూరంగా పోలేదు. తన ప్రజల బాధల్లో, గాథల్లో, ఆరాటాల్లో, పోరాటాల్లో, కష్ట సుఖాల్లో కాళోజీ ప్రత్యక్ష భాగస్వామి కాగలిగాడు. దాశరథి కవికి గాయపడిన గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో వినిపించగా కాళోజీ చెమ్మగిల్లిన కన్నుల్లో కమ్మలెన్నో చదివాను అంటాడు. నాడు రాచరిక అరాచక పాలనలో అగ్నిగుండంగా మారిన తెలంగాణ హృదయ విదారక దృశ్యాలు కాళోజీ కవితల్లో కనిపించినంత స్పష్టంగా ఇంకే కవితల్లో కన్పించవేమో!. కాళోజీ కవి ఆగ్రహాగ్ని, ప్రతీకార జ్వాలలు అన్ని అంచులు దాటి ఎగసిన కవిత ఇది మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, మానవాధములను మండలాధీశులను మరచి పోకుండగ గరుతుంచుకోవాలె, కసి ఆరిపోకుండ బుసకొట్టు చుండాలె, కాలంబు రాగనే కాటేసి తీరాలె,.. తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె, కొంగులాగిన వ్రేళ్ల కొలిమిలో పెట్టాలె, కన్ను గీటిన కళ్ల కారాలు చల్లాలె, తన్నిన కాళ్లను డాకలిగ వాడాలె, కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె, కాలంబు రాగనే కాటేసి తీరాలె. తన తెలంగాణ ప్రజలు తన కళ్లముందే చిత్రహింసకు గురవుతున్న బీభత్స దృశ్యాలను చూడలేక, సహించలేక ప్రళయకాల రుద్రుడై కాళోజీ రాసిన కవిత ఇది. నిజానికి కాళోజీ హింసాత్మక ధోరణులతో ఎన్నడూ ఏకీభవించని గాంధేయవాది, ప్రజాస్వామ్యవాది, మానవతను ఆరాధించిన మహనీయుడు.

గాంధేయవాది అయినప్పటికీ కాళోజీ ఎటువంటి భ్రమలు లేకుండా వాస్తవాలను గుర్తించిన మహాకవి. ఆయనే అన్నారు.. బాపూజీ బ్రతికిన యప్పటి సత్యాహింసల దుప్పటి బొంకుల బొంతగ మారెను, ఘనతలు సాంతము దీరెను, దానికి పడ్డవి చిల్లులు, దాచలేదు ఇక కల్లలు… తన కైతల చేత జనుల మగత నిద్దురను దూరంచేసి జాగృతి, చైతన్యం కల్పించాలనుకున్న, సామాజిక స్పృహ మిన్నగా ఉన్న ప్రజాకవి కాళోజీ ఒక సందర్భాన అన్నారు.. కైత చేత మేల్కొల్పకున్న కాళోజీ కాయము చాలింక. ఈ వాక్యంలో కాళోజీ కవి నిస్పృహ కాదు సమరశీలత వ్యక్తమైంది. కాళోజీ విశిష్ట వ్యక్తిత్వం మమతకు మరో రూపం, కారుణ్యానికి పర్యాయపదం. ఆయన అంటారు.. ..మమత యున్న మనసులోనే సమతాభావం కలుగును.. మనసు వున్న మానవుడను, మమతలేని బ్రతుకు బ్రతక.. కాళోజీ అప్పటి, ఇప్పటి అసహనశక్తుల విజృంభణను నాడే పసిగట్టి ఈ మాటలని ఉంటారు. మమతకు, సమతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు. కాపట్యానికి ఖండ పరశువు కాళోజీ. విద్వేషాన్ని, వివక్షను ఆయన వర్జించాడు. ..సంఘాలు, నియమాలు, సంప్రదాయాలు మనిషిలోని కుళ్లుకు మారురూపాలు.. అని ఆయన గర్జించాడు. శల్యరాజు సారథ్యము, కౌరవపతి కౌగిలింత, పూత వసతి పోతపాలు, కంసు మామ గారవంబు, పై మెరుగులు లోమరుగులు, విషపు నవ్వు వెక్కిరింత, దొంగ నవ్వు దొంగేడుపు, ముసుగుల్లో గుసగుసలు అంటూ ఆయన చుట్టూరా పొంచి ఉన్న ప్రమాదాల గురించి హెచ్చరించాడు.

సర్వదా కాళోజీ సామాన్యుల పక్షం. అనామకుని ధీశక్తిని అడిగేవాడే లేడు.. తోక వూపి మూతి నాకు తుచ్ఛులకే వైభవాలు అని ఆయన ఆందోళనకు గురవుతాడు. కాళోజీ కవితల్లో చురకలకు కొదువ ఉండదు. తన గొడవ అంటూ కాళోజీ ప్రపంచం గొడవను వినిపిస్తాడు. నా తప్పులను దాచ నానా రకాలైన ధర్మ సూత్రాలతో దడి కట్టుతాను అన్న వాక్యంలో ఆయన కొన్ని ధర్మసూత్రాల డొల్లతనాన్ని వెల్లడించాడు. తమ తప్పులను దాచుకోవడానికి నానా ధర్మసూత్రాల పేరిట దడి కట్టుతారన్నది ఈ కవిత తాత్పర్యం. తెలంగాణ కర్షక జనుల పాత్ర ఎంత ముఖ్యమైనదో కాళోజీ ఓ కవితలో వివరించారు. కర్షకా! నీ కర్రు కదలినన్నాళ్లే! అందరి పొట్ట, నిండుతుంది, ఆకలి తీరుతుందని కాళోజీ స్పష్టంచేశారు. నాగలి కర్రు విలువ నాగరికులకు అర్థం కావడం సులభం కాదు.

కాళోజీ ఆరోప్రాణం, మరో ప్రాణం తెలంగాణం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు ఇక్కడి అన్ని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలకు కాళోజీ అండగా, ఆశీర్వాదంగా నిలిచారు. అవనిపై జరిగేటి అన్ని అవకతవకలు, ఆందోళనలు, అలజడులు కాళోజీ కవి హృదయాన్ని కదిలించాయి; ఆయన కలానికి, గళానికి అవి ఆవేశం కలిగించాయి. అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము జూచి కరగిపోవును గుండె, మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు, పతిత మానవు జూచి చితికిపోవును మనసు.. తప్పు దిద్దగ లేను దారిజూపగలేను, తప్పుచేసిన వాని దండింపగా లేను, కష్టపడు వారలను కాపాడగా లేను… కాళోజీ లేఖిని నుంచి వెలువడిన ఆణిముత్యం వంటి ఈ గీతం కాళోజీ నవనీత హృదయానికి, ఆయన మానవతా దృక్పథానికి అక్షర దర్పణం. ఈ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించి మాజీ ప్రధాని, కాళోజీ ప్రియమిత్రుడు పీవీ. నరసింహారావు టాటా స్మారక ప్రసంగంలో చదివారు. మానవ సమాజంలోని అసమానతలు, వ్యత్యాసాలు కాళోజీ కవి హృదయానికి అమిత ఖేదం కల్గించాయి. అన్నపు రాసులు ఒకచో ట ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలొక చోట అలిసిన దేహాలొకచోట.. అని ఆయన బాధపడుతారు. మానవతావాదిగా, ప్రజాస్వామ్య ఆరాధకుడిగా కాళోజీ రాచరిక వ్యవస్థను ఎదిరించినప్పటినుంచీ ఫాసిస్టు శక్తులను, బూటకపు దేశభక్తులను తీవ్రంగా ఖండించారు. నవ యుంగబున నాజీ వృత్తుల నగ్న నృత్యమింకెన్నాళ్లు? అంటూ కాళోజీ కవి వేదనారవంతో ప్రశ్నించారు. తెలంగాణ కవి కాళోజీ అస్తమించని రవి-తెలంగాణ పవి.

(రేపు కాళోజీ జయంతి)

నమస్తే తెలంగాణ సౌజన్యంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *