తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ 37శాతం ఓట్లతో 10 నుచి 12 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 5 స్థానాలతో రెండవ స్థానానికే పరిమితమవుతుందని సోమవారం వచ్చిన ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు తెలిపాయి. పోలింగ్ కు ముందు నిర్వహించిన సర్వేల కంటే తర్వాత జరిపిన ఒపీనియన్ పోల్స్ లో టీఆర్ఎస్ కు మరింత సానుకూలత కనిపించిందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో టీడీపీ-బీజేపీ కూటమి రెండు స్థానాలకే పరిమితమవుతుందని, సీమాంధ్రలో మాత్రం వైసీపీకి, టీడీపీ-బీజేపీ కూటమికి 11-15 స్థానాలు వస్తాయని, వారిద్దరిమధ్య పోటాపోటీ నెలకొని ఉందని సర్వేలు తెలుపుతున్నాయి.
మరోవైపు నరేంద్రమోడీయే కాబోయే ప్రధాని అని అన్ని ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు స్పష్టం చేసాయి. 2014 సార్వత్రిక ఎన్నికలు సోమవారం సాయంత్రం ముగిసిన వెంటనే న్యూస్ ఎక్స్, ఇండియాటుడే, సీఎన్ఎన్, ఐబీఎన్, టైమ్స్ నౌ మొదలైన సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సొంతంగా 230-240 ఎంపీ స్థానాలు సాధించి మొదటిసారి 200 మార్కును దాటనుందని, కాంగ్రెస్ పార్టీ కేవలం 100-110 స్థానాలకే పరిమితం కానుందని తెలిపాయి.