mt_logo

ఈ గోడ బీటలు వారింది…

By: -అల్లం నారాయణ

పొద్దున్నే కల. అసెంబ్లీ చుట్టూ గోడ మొలిచినట్టు. అదీ పాత ముషీరాబాద్ జైలు గోడ కన్నా ఎత్తుగున్నట్టు. పైన అచ్చం జైలు లాగానే కరెంటు తీగలు చుట్టినట్టు. అయితే ఆ కరెన్టు తీగలు అచ్చంగా తెలంగాణ ఉద్యమం మీద అణచివేత తీవ్రమైనప్పటి నుంచీ ప్రతి మూల మలుపులో, చివరికి అమరవీరుల ఆత్మల వేదికయిన గన్‌పార్క్ చుట్టూ చుట్టుకొన్న రక్కీస ముండ్ల మెరిసే లోహ కంచెలయినట్టు. కలలోనే ఊపిరి సలపక మెలకువొచ్చింది.

నిజమే. కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న తెలంగాణ మనసుల్లో ఒక గోడ కట్టిండు. అసెంబ్లీ ప్రజలది కాదని తేల్చి చెప్పిండు. ప్రజలదనేకంటే తెలంగాణ ప్రజలది అసలే కాదని తేటతెల్లం చేసిండు. ఇది ప్రజాస్వామ్యం చివరికి కనిస్టీబు చేతిలో లాఠీస్వామ్యం అవుతుందని నిరూపించిండు. ముఖ్యమంత్రి చెప్పినా వినని కనిస్టీబు (పోలీసు కమిషనర్ అయితే కావొచ్చు గాక) ప్రజాస్వామ్యం లాఠీ లేకపోతే ఎట్లా పరిఢవిల్లదో కూడా చెప్పేశాడు.

దాపరికమేమీ లేదు. ఖుల్లంఖుల్లా. ఇది గుర్రం ఇది మైదానం. అసెంబ్లీ, ప్రజాస్వా మ్యం, అన్నీ హైదరాబాద్ మహానగరంలో ముళ్ల కంచెలు, లోహపు లాఠీలు ధరించి తిరిగే యమకింకరులు, బారికేడ్లు, బాష్పవాయువులు పేల్చే గన్‌లు, చిప్పటోపీలు, కరుకు బూట్ల పరిధిలోనే ఉంటాయని నిరూపించాడు. లేకపోతే ప్రజాస్వామ్యం బతకడం కష్టం.

అరవై ఐదు సంవత్సరాల క్రిందట హైదరాబాద్ రాజ్యం పతనం అయినప్పటి నుంచీ బహుశా ఇట్లా అడుగుకో బారికేడ్ నిర్మించిన నిర్బంధం ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. మతకల్లోలాలు జరిగిన సమయాల్లో కూడా ఇట్లా వేలమంది బెటాలియన్లు దిగలేదనుకుంటా. ఇదే జూన్ నెల. మరి పది రోజులయితే ఎమర్జెన్సీ దినం. కానీ ఇదే నగరానికి చెందిన పౌరులు, ఇదే రాష్ట్రానికి, హైదరాబాద్ రాజ్యం, తెలంగాణ ప్రజలు ఎమ్జన్సీలో కూడా ఇట్లా అచ్చం కాందీశీకుల వలె, అచ్చం ఎవ రి ఇంట్లో వాళ్లు పరాయిల వలె, అపరిచితులవలె, దారి లేని దారులలో అన్వేషించే ఒకరికొకరు ఏమీ కాని ఒంటరి ముసాఫిర్‌ల వలె, చిరునామాలు కోల్పోయిన, అస్తిత్వమెక్కడ? ఉనికి ఎక్కడ? అని తండ్లాడే అచ్చు హైదరాబాదీ వలె ఎవరూ నిర్బంధాన్ని అనుభవించి ఉండరు. అయితే ఇది రెండో సందర్భమే అనుకుంటా..

రెండు సందర్భాలూ తెలంగాణవే. 1969, జూన్ 1, మలబారు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్ముకాశ్మీర్, కర్ణాటక, తమిళనాడు, బీహార్, గూర్ఖా ఫోర్స్ లాంటి బలగాలన్నింటినీ ఉపయోగించారు. ఒక అగ్గి పుట్టింది, ఆ అగ్గిని ఆర్ప నానాజాతి బలగాలు హైదరాబాద్ గుండెను ఛిద్రం చేశాయి. ఘాంసీ బజార్, అలీజాకోటా కాలీకమాన్, పత్థర్‌ఘట్టీల నుంచి పల్లె పల్లెకూ పాకింది అలనాడు తెలంగాణ. పురానాఫూల్ నుంచి హుసేనీ ఆలం మీదుగా, చార్మినార్ దాకా దండు కదిలివచ్చి రాజ్‌భవన్ ఒక నెత్తుటి సంద్రమయింది. అదిగో అప్పుడూ అంతే.. హైదరాబాద్ ఉన్నది కదా! రాజధాని గొడ అని నీలం సంజీవరెడ్డిల నాయకత్వాలు చివరికి ఇట్లా అసెంబ్లీలను, అధికారాన్ని హస్తగతం చేసుకొని, ఆయన వారసులివ్వాల అసెంబ్లీకి గోడపెట్టే దాకా ఎదిగింది తెలంగాణ. ఇదొక ఒడువని కథ.

ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర చెట్టుకు మళ్లీ వేలాడిందొక శవం. కాలం మారింది. అంగీనే జెండాగా ఎగరేసి గుండ్లకు గుండెలడ్డిన వాడి ఆత్మ ఉస్మానియా విద్యార్థిని ఇంకా ఆవహించనే లేదు. పోరాడడమే బతకడం. బతకడమే పోరాడడం. తెలంగాణ అంతే ఇదొక శాపగ్రస్థ కానీ.. తెలంగాణ ఒక నిర్బంధ ప్రయోగశాల కానీ.. ఇదొక నిత్య పోరాట కెరటం. ఆత్మహత్యలకు ఇక్కడ తీరిక లేదు. ముళ్ల కంచె లు సలుపుతున్న నెత్తుటి గాయాల్లోంచి తిరుగుబాటు మాత్రమే కోరుకుంటున్నది తెలంగాణ. అయినా మనం శవాలం కాకముందే చాలామంది జీవన్మృతులున్నారు. బతికీ చచ్చిన చందంగా…

కల పొడిగింపు కూడా చెబుతాను. పొద్దుటి కలకు కొనసాగింపు. ఆ గోడ లోపలికి ప్రవేశించడానికి చీమల పుట్టల్లా దండు కడ్తున్న జనం.. ఎగబాకుతున్న జనం.. కింద డీజీపీలు, కనిస్టీబుళ్లు తళతళలాడే లోహపు లాఠీలతో, కిందికి లాగుతున్న కబంధహస్తం. పెద్ద గేటు.. ఆ గేటు ముందు పాస్‌లు చెక్‌చేస్తూ… కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు వచ్చారు. మన వాళ్లే రానివ్వు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. మన వాళ్లే రానివ్వు. జనం వద్దు. జేఏసీ వద్దు. చాలు. ఈ మనవాళ్లు ఎవరు? ఈ మన వాళ్లు కుమ్మక్కు అయ్యారు కనుకనే ఒక ప్రాంతం మీద కక్ష. ఒక ప్రాంతం ప్రజల మీద అధికార జులుం. కానీ ఆ గోడ పగులుతున్నది. చీమలదండు ఎగబాకుతున్నది. గోడ పగుల గొడితేనే విముక్తి. చీమలదండు విద్యు త్ ప్రవహించే కరెంటు తీగలు తెంపి గోడ కూలుస్తున్న దృశ్యం. కుమ్మక్కు తెలంగాణ నాయకులతో పరివేష్టితమైన అధికారాన్ని బద్దలు కొట్టాల్సిందే. ఇక గోడ కూలాల్సిందే. జనం తండోప తండాలు. ప్రవాహంలాగా.. వెలుతురు లాగా.. పట్టగొలుసుల కాళ్లు… వెండి మట్టెల కాళ్లు.. రహీమున్నీసా నువ్వు జయిస్తావ్. ఔర్ ఏక్ ధక్కా… మెలకువొచ్చింది.

వర్తమానంలో ఇంకా పీడ కలలు కంటున్నది తెలంగాణ. రాత్రి ముళ్ల కంచెలు ఛేదించుకున్న కల నుంచి వాస్తవంలో టీవీ తెరమీద చెట్టుకు వేలాడిన శవం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్యం మౌలిక సూత్రాల్లో ‘డిసెంట్’ గురించీ మాట్లాడుకోవాలి. ప్రజాస్వామ్య సౌధమయిన పార్లమెంటు గురించీ మాట్లాడుకోవాలి. తెలంగాణ ఒక రాజ్యాంగబద్ధమైన డిమాండ్. ప్రజాస్వామ్యయుతమైన పోరాటం. ఫలితమూ ప్రకటించారు. శాంతిగానూ, ప్రజాస్వామ్యబద్ధంగా నూ, ఓరిమితోనూ, చీమల దండులై తెలంగాణ కట్టిన జన సౌధం ధాటికి, భారత ప్రజాస్వామ్య సౌధం, తెలంగాణ ప్రక్రియ ప్రకటన ఫలితాన్నిచ్చింది. కానీ అదే ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం గుప్పెడుమంది దళారీల, పెట్టుబడిదారుల, ఆధిపత్యాల, అధికారాల, రాజ్య పాలకులకు సేవ చేయని దే, ఈ సౌధానికి కాపలాకాసే పోలీసు బలగాల అనుమతి లేనిదే మనజాలదని నిరూపణ అయింది. అయ్యా తెలంగాణకు సంబంధించి ప్రజాస్వామ్యం ఓడిపోయింది. అప్పుడడిగింది తెలంగాణ. ప్రజాస్వామ్యం ఇంకా బతికి ఉందని భావించింది తెలంగాణ. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి చివరి ప్రయత్నంగా, అసెంబ్లీకి దండుకట్టింది తెలంగాణ. కానీ కానీ.. కనిస్టీబు రానివ్వలేదు.

కోర్ కమిటీ (చోర్ కమిటీ అంటారు. తెలంగాణ వాదులు)లో గుప్పెడు మంది కోసం పనిచేసే యంత్రాంగాలు ఉన్నాయి. మనుషులున్నారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యిమంది మరణాలకూ స్పందించని పార్టీగా ఉండడం వెనుక మహా ప్రజాస్వామ్య సూత్రం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సీమాంధ్ర పెట్టుబడి మాట వినాలి. అది విస్తరించిన చోట ల్లా జైళ్లు కట్టాలి. అది విస్తరించిన చోటల్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి గోడలు కట్టాలి. బహుశా సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్‌ల ఆదేశాలకు మాత్రమే బలగాలూ వస్తాయి. బందోబస్తూ వస్తుంది. అంతా ముగిసినాక కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా సోనియాగాంధీ కీర్తిస్తుంది. ఇది కలకాదు. కఠినమైన వర్తమానం.

చిన్నా చితకా సంఘటనలు జరగవచ్చు. కోదండరామ్ అనే ప్రొఫెసర్‌ను, పోలీసులు పడేసి తొక్కవచ్చు. ఒక కనిస్టీబు లాఠీతోనూ కొట్టాలని ఎత్తవచ్చు. విద్యాసాగర్‌రావు అనే కేంద్ర మాజీ మంత్రి చెయ్యి నెత్తురు చిందవచ్చు. కవిత కిందపడ్డొచ్చు. బాష్పవాయుగోళం తగిలిన విద్యార్థి స్పృహ తప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఎల్లయ్య రెండు కాళ్లూ విరగవచ్చు. ఎమ్మెల్యేలూ, మాజీ మంత్రులూ, ఎమ్మెల్సీలు వాళ్లు తెలంగాణ వాళ్లైతే చాలు మీదపడి కుక్కలు గాటేయవచ్చు. కానీ అదంతా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. తన ఊరిలో తను పరాయి కావొచ్చు. ఆఫీసుకు వెళ్లేవాడికీ కార్డు చెల్లుబాటు కాకపోవచ్చు. ఇంటి నుంచి పరీక్షకు బయలుదేరిన అమ్మాయి కళ్లల్లో నీళ్లు రావొచ్చు.

ఆప్ ఖత్‌రేమే హై .. ఈ నగరం మీది కాదు. ఈ నగరం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజ్యానిది. అందువల్ల తెలంగాణ తన ప్రాంతంలో తాను పరాయి అయింది. కిరాయికి వచ్చినవాళ్లు మకాన్ దార్ కావడం అంటే ఇదే. ఇప్పటికీ ఐక్యరాజ్యసమితిలో ఒక చారివూతక అవశేషం హైదరాబాద్ అదొక అపరిష్కృత సమస్య కాకపోవచ్చు. దండయాత్రలు అనేకం జరిగిన ఈ ఒంటరి సమాజం ఇప్పుడు అనుభవిస్తున్న యాతన రెండోశ్రేణి పౌరుడి యాతన.

మూడు సందర్భాల్లో హైదరాబాద్‌కు రానివ్వకుండా చేశారు. మిలియన్ మార్చ్, సాగరహారం, చలో అసెంబ్లీ. ఆ మాటకొస్తే హైదరాబాద్ కళ్లు, ముక్కు, చెవులు చెంపలు చెక్కేసి, ప్లాట్లు ప్లాట్లుగా విభజించి ఆక్రమించుకున్న నీలం సంజీవరెడ్డి వారసులు రాజ్యమేతున్నాయి. ఎవరు కట్టించిన అసెంబ్లీ ఇది. ఎవరు రాజ్యమేలుతున్నారు. బహుశా రెండవశ్రేణి బానిసలయిన కాంగ్రెస్ తెలంగాణ నాయకులకు ఇది అర్థం కాకపోవచ్చు. బానిసకు జ్ఞానం ఉంటుంది. కానీ… పనిచేయదు. బానిసకు మెదడు ఉంటుంది. కానీ ఆలోచించనివ్వదు. ఈ బానిసల వల్ల కదా! తెలంగాణ చెట్టుకు ఉరిపోసుకొని ఆత్మహత్య అయ్యింది. ఈ బానిసల వల్ల కదా తెలంగాణ ఒక ఆధిపత్య అహంకార రాజ్యాధినేతల దండయాత్రల్లో పరాయిదయింది. పుట్టిన చోట పరాయి కావడం. తన ఇంట్లోకి తాను ప్రవేశించలేకపోవడం.

ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏడుస్తున్నది ఒక అమ్మ. కడుపులో సుమ్మర్లు చుట్టే శోకం. కానీ హైదరాబాద్ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ దుక్కంలోనే ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కోల్పోయిన ఆత్మలతో వాళ్లు పోరాడుతూనే ఉన్నారు. తల్లులారా దుఃఖించకండి.. స్తూపాల మీద చెక్కని పేర్లతో కలలుగంటున్న వారు ఇప్పుడు మేల్కొంటున్నారు.

ముళ్ల కంచెలు దాటి, బారికేడ్లు దాటి, అగడ్తలు దాటి బాష్పవాయుగోళాలు దాటి బయట ఊపిరి సలపనివ్వని తెలంగాణ. గోడ బయట ఒక ఉప్పెన. చలో అసెంబ్లీలో పొద్దంతా పిచ్‌డ్ బ్యాటిల్స్… ఎక్కడ దొరికితే అక్కడ. సందు దొరికితే ఉరుకు. ముట్టిచ్చుకో అసెంబ్లీని. ఇదొక సవాల్. వేల మందిని దాటి, చక్రబంధాలు దాటి ఉరికింది తెలంగాణ. కిరణ్‌కుమార్‌రెడ్డి ఓడిపోయిండు. తెలంగాణ నిలబడి, కలెబడి గెలిచింది.అసెంబ్లీ భవనం మీద ఎగిరింది నల్ల జెండా. ఇదే మోఖా. గోడలు పగులగొట్టడమే ఇప్పటి కర్తవ్యం. ఎన్ని నిర్బంధాలు, ఎన్ని అణచివేతలున్నా… ఒక్కటి గుర్తుంచుకోవలసి ఉన్నది. నిర్బంధం ప్రతిఘటనను రెచ్చగొడ్తుంది. సహజసూత్రం వేల బలగాలు ప్రభుత్వాలను కాపాడలేవు. అదీ నిజమే. యాభై ఏడు సంవత్సరాల పీడనను, అణచివేతను ధిక్కరించి అసెంబ్లీ లోపల సీమాంధ్ర ప్రభు త్వం దిష్టిబొమ్మ దగ్ధమయింది. ఇది చాలు ప్రతీకాత్మక యుద్ధం. నిజమే మీరు వేల బలగాలు దించిన ఉక్కు సంకెళ్లను ఛేదించుకొన్న ఉద్యమం ప్రతీకాత్మకమే. అసెంబ్లీకి ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన దారి దొడ్డిదారి. విలీనం లాగే. అయినా. అసెంబ్లీ బయట పరిగెత్తిన తెలంగాణవాది. లోపల దిష్టిబొమ్మ తగులబెట్టిన ఎమ్మెల్యే. లోపలా బయటా ఉక్కుపాదం తుక్కు తుక్కు అయింది. ఇదొక భవిష్యత్ సూచిక. గోడలు పగులుతాయి.

అయినా ఒక సూటి ప్రశ్న. ఆంధ్రవూపదేశ్‌ను వేల బలగాలతో ఎన్ని రోజులు కాపాడగలరు. విడిపోకుండా ఎన్ని బలగాలను దించగలరు. ఈ గోడ ఎన్నడో బీటలు వారింది. తెలంగాణ సాకారమవుతుంది. ప్రజాస్వామ్యం నిజంగానే వర్ధిల్లుతుంది. 1969 నక్సల్బరీ అయింది. 2013 ఛత్తీస్‌గఢ్ కాకముందే ఏలికలు మేలుకుంటే మంచిది. లేదా యుద్ధాలు విస్తరిస్తాయి జాగ్రత్త!

[నమస్తే తెలంగాణ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *