mt_logo

నిజామాబాద్ జిల్లా నుండి ఈ-పంచాయితీకి శ్రీకారం..

ఈ పంచాయితీల ఏర్పాటుకు నిజామాబాద్ జిల్లా నుండే శ్రీకారం చుట్టనున్నట్లు, మారుమూల గ్రామాలకు కూడా ఈ-గవర్నెన్స్ ఫలాలను తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఈ-పంచాయితీలతో గ్రామీణ ప్రజలకు వివిధ రకాల పౌర సేవలను సులభంగా అందించేందుకు వీలు కలుగుతుందని, గ్రామీణులు తమ వినియోగ సేవల బిల్లులతో పాటు పలు రకాల పన్నులను ఈ కేంద్రాలలో చెల్లించవచ్చని తెలిపారు. అనేక రకాల సేవలను ఒకే చోట అందించే వన్ స్టాప్ షాప్ లా ఈ-పంచాయితీలు పని చేస్తాయని, ఆసరా పించన్లు, ఉపాధిహామీ కూలీల చెల్లింపులు, ఇంకా పలు సంక్షేమ పథకాల నగదు చెల్లింపులను కూడా దశలవారీగా ఈ కేంద్రాల ద్వారా చెల్లించనున్నట్లు చెప్పారు.

తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 150 మండలాల్లో ఈ-పంచాయితీలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న జాతీయ ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ పథకం పనులను పర్యవేక్షించిన మంత్రి పనులను వేగవంతం చేయాలని కోరారు. వచ్చే జూన్ రెండు నాటికి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ పనులు పూర్తి చేయాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రతిసారీ సమీప పట్టణాలకు వెళ్లే అవసరం లేకుండా తమకవసరమైన సమాచారాన్ని ఈ కేంద్రాల ద్వారా పొందవచ్చని, వీటి కనెక్టివిటీ కోసం విశాట్ టెక్నాలజీ, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కనెక్టివిటీ ఉపయోగించుకోబోతున్నట్లు మంత్రి వివరించారు. నిజామాబాద్ జిల్లా దోమకొండలో మొదట ఏర్పాటు చేయబోయే సేవలను మొత్తం మండలంలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ప్రారంభిస్తామని, వీటి నిర్వహణ కోసం ఆయా గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ మహిళలను ఎంపిక చేసి వారికి తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *