mt_logo

దుష్టగ్రహ కూటమి

తన స్వార్థంకోసం జయచంద్రుడు అనే ఒక అల్పుడు చేసిన ద్రోహానికి మొత్తం భారతదేశం 800 ఏండ్లు విదేశీయుల పాలనలో మగ్గాల్సివచ్చింది. అంభి అనే రాజు అసూయవల్ల పురుషోత్తముడి పరాజయం.. ఆ తర్వాత దేశంపై అనేక దండయాత్రలకు దారులువేసింది. ఇది చరిత్ర. ఇవాళ రాష్ట్రంలో మహాకూటమి పేరిట బాగోతం ఇదే ఉదంతాన్ని గుర్తుకుతెస్తున్నది. కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు జయచంద్రుడి పాత్రపోషణకు ఉవ్విళ్లూరుతున్నాయి. పోరాటాలు, త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన తెలంగాణను తిరిగి ద్రోహుల పాదాక్రాంతంచేసేందుకు ఒకరినిమించి ఒకరు పోటీపడుతున్నారు. ఇచ్చింది, తెచ్చింది తామేనని చెప్పుకొనే కాంగ్రెస్, ఉద్యమ ఆకాంక్షలంటూ కతలుచెప్పే టీజేఎస్.. తెంగాణ ప్రజలు ఏ శక్తుల మీద పోరాటం చేశారో అ శక్తుల బాంచన్‌గిరీకి నిస్సిగ్గుగా ఎగబడుతున్నాయి. తెలంగాణ తన్ని తరిమేసిన ద్రోహులను భుజాలపై మోసి తెలంగాణలో ప్రతిష్ఠించటానికి పోటీపడుతున్నాయి. ముష్టి మూడు నాలుగు సీట్లకోసం బిచ్చమెత్తుకుంటున్నాయి.

పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏది?
రాజకీయాల్లో పొత్తులు కొత్త కాదు.. తప్పూ కాదు. కానీ పొత్తుకు ఓ ప్రాతిపదిక, సైద్ధాంతిక సారూప్యత ఉండాలి. కనీసం కార్యక్రమాల అవగాహన ఉండాలి. కానీ మహాకూటమికి ఎలాగైనా గెలవడమనే ఆశతప్ప మరే సైద్ధాంతికతా కనిపించడలేదు. అదేమంటే.. మీరు గతంలో పొత్తు పెట్టుకోలేదా? అంటూ గాయిగాయికి దిగుతున్నారు. అవును.. టీఆర్‌ఎస్ 2004లో పొత్తు పెట్టుకుంది. ఎందుకు? తెలంగాణ ఏర్పాటుపై ఒక జాతీయపార్టీ తొలిసారి ముందుకొచ్చింది. ఆ పార్టీ జాతీయనాయకుడు ఆజాద్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వచ్చి పొత్తుకోసం అర్జీ పెట్టుకున్నారు. ప్రణబ్‌ముఖర్జీ ఫోన్‌లో మాట్లాడారు. ఫలితంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలిగిన అవకాశం కలిగింది. తెలంగాణ వాదన ఢిల్లీకి చేరడానికి వేదిక దొరికింది. అందుకే పొత్తుకు టీఆర్‌ఎస్ సిద్ధపడింది. అది నిష్ఫలంకాలేదు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఆ మాటే.. ఆ పార్టీ మెడకు చుట్టుకుని తప్పించుకోలేని పరిస్థితిని తెచ్చింది. 2009లో టీడీపీతో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంది. అంతదాక సమైక్య రాష్ట్రానికే బలంగా కట్టుబడి.. రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిబంధకంగా ఉన్న టీడీపీ.. తెలంగాణకు అనుకూలంగా తీర్మానంచేసింది. స్వయంగా చంద్రబాబు ఈ విషయాన్ని కేసీఆర్‌కు ఫోన్‌చేసి చెప్పి పొత్తు కోరారు. ఆయన తరఫున సీఎం రమేశ్ తెలంగాణభవన్‌చుట్టూ చక్కర్లు కొట్టారు. సగర్వంగా తలెత్తుకుని పొత్తుకు టీఆర్‌ఎస్ అంగీకరించింది తప్ప సీట్లు ముష్టెత్తుకోలేదు. కొత్తగా వచ్చిన చిరంజీవి పార్టీ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఆ దెబ్బకు తెలంగాణ నినాదం ఎత్తుకోక తప్పలేదు. ఈ రెండు పొత్తులు టీఆర్‌ఎస్ అధికారం చేపట్టాలని ఆశించి పెట్టుకున్నవికావు. ఇవాళ కూటమికి నేతృత్వం వహించే కాంగ్రెస్ లక్ష్యమేమిటో తెలియందీ కాదు. మాకు ఓటెయ్యకుంటే తిరిగి ఆంధ్రలో కలిపేస్తాం అని వరంగల్ ఉప ఎన్నికల్లో ఓ నాయకుడి మాటల సారాంశాన్ని బహుశా మహాకూటమి రూపంలో ఇవాళ చూపిస్తున్నారేమో!

రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నారు?
ఈ పచ్చి అవకాశవాదం రాష్ట్రానికి ఏ గతి పట్టిస్తుంది? గత నాలుగేండ్ల అనుభవాలే సమాధానం. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేంద్రంలో బీజేపీ సర్కారుతో ఏపీ చెట్టపట్టాలేసుకున్నకాలంలో ఓ ఆంధ్రమంత్రి జాగ్రత్త.. మీరెక్కిన తెలంగాణ టేబుల్ మా చేతిలో ఉంది. ఏ క్షణంలోనైనా లాగేయగలం అని బెదిరించారు. వారి పెత్తందారీ ధోరణికి ఇది ఉదాహరణ. హైదరాబాద్ మీద మాకు హక్కుంది. మా పోలీసులను పెట్టుకుంటాం అన్నారు. తెలంగాణలో ఐదేండ్లకు ముందే ఎన్నికలొస్తాయి. టీడీపీ అధికారం చేపడుతుంది అని సాక్షాత్తూ చంద్రబాబే ప్రకటించారు. ఆ తర్వాత ఓటుకు నోటు కుట్ర సాగింది. రాష్ట్ర విభజన తన జీవితంలో బ్లాక్‌డే అని బాబు అంతరంగం ఘోషిస్తూనే ఉంది. ప్రతి జూన్ 2న తెలంగాణ ఏర్పాటుపై ఆయన విషంకక్కుతూనే ఉన్నారు. కొంతకాలంక్రితం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు ఎలా కడతారో చూస్తా! అంటూ సవాలుచేశారు. వీటిని ఆపాలంటూ కేంద్రానికి నిర్విరామంగా లేఖలు పంపారు. నిన్నటికి నిన్న నిండు గర్భిణిలా ఉన్న శ్రీశైలాన్ని దొంగచాటుగా తోడేశారు. ఇవన్నీ కాంగ్రెస్ అండ్‌కోకు తెలియవా? తెలుసు. అయినా వారికి పట్టదు. రేపు అధికారం వస్తుందంటే ఆంధ్రలో కలవడానికి, కలపడానికీ ఆ పార్టీ వెనుకంజవేయదు. రేపు గ్రహచారం బాగలేక కూటమి ప్రభుత్వం వస్తే అది తెలంగాణకోసం పనిచేస్తుందా? ఆంధ్ర కోసమా? కాళేశ్వరం, పాలమూరును ఆపుతానన్న చంద్రబాబు రేపు ఆ దిశగా అడుగులేస్తే ఏం చేస్తారు? ఇపుడు మహాకూటమి చెప్పాల్సిన జవాబులివి!

మరి తెలంగాణ ఎందుకు?
సుదీర్ఘ పోరాటాలు, వందల బలిదానాలతో తెలంగాణ వచ్చింది. అయినా ఇప్పటికీ ఎన్నో కుట్రలు.. అడ్డంకులు.. దాడులు! అన్నింటినీ తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నది. చెప్పాపెట్టకుండా ఏడు మండలాలు గుంజుకున్నారు. కరంటు ఆపి క్రూరపరిహాసాలుచేశారు. ఉద్యోగుల విభజనకు మోకాలడ్డారు. రాత్రికిరాత్రి నిధులు తరలించుకున్నారు. హైదరాబాద్‌పై కర్రపెత్తనానికి దిగారు. దీన్నుంచి విముక్తమయ్యేందుకు తెలంగాణ ఎంతో శ్రమించాల్సి వచ్చింది. హైదరాబాద్‌పై ఎత్తుగడలను జీహెచ్‌ఎంసీలో విజయంతో తిప్పికొట్టింది. కుట్రదారులను అమరావతికి పంపించి.. సంపూర్ణ విముక్తి సాధించుకుంది. ఇలాంటి తెలంగాణను ఈ గడ్డమీద పుట్టిన కొందరు పరాన్నభుక్కులు తిరిగి ఆంధ్రపాలకుల పాదాక్రాంతం చేయడానికి పోటీపడుతున్నారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో.. వందల బలిదానాలు ఎందుకు జరిగాయో.. తెలంగాణకు చివరిదాకా అడ్డంపడిందెవరో.. తెలంగాణకు ఎవరివల్ల ముప్పు ఉన్నదో వారికి సోయి ఉండదు. గుడ్డి ద్వేషం.. అధికార యావ.. కడుపునిండా కుట్ర! అన్నీ కలిసిన మహాభూతమే మహాకూటమి. రెండు జీవనదులుండీ నీటికోసం తెలంగాణ ఇబ్బందులు పడుతుంటే.. ఒక్క జీవనదీ లేని తమిళనాడు అభివృద్ధిని సాధిస్తున్నదంటే కారణం అక్కడి నాయకుల వెన్నెముకలు నిటారుగా ఉండడమే. కావేరి అంశం తెరపైకివస్తే తమిళ ప్రజలంతా రోడ్లమీదికి వచ్చి ప్రయోజనాలు కాపాడుకుంటే.. ఇక్కడ తెలంగాణను ఎండబెట్టే పోతిరెడ్డిపాడుకు మద్దతుగా ఓ కాంగ్రెస్ నాయకుడు బహిరంగచర్చకు పంచలు ఎగగట్టి పరిగెత్తుకొస్తే.. ఇంకొకడు పత్రికల్లో సమర్థిస్తూ వ్యాసాలు రాస్తాడు. అడ్డంగా నీళ్లు దోచుకుపోతుంటే ఇద్దరూ నోరెత్తరు. ఇదే తెలంగాణ దౌర్భాగ్యం.

కాంగ్రెస్ నీతికి విదర్భ ఉదాహరణ..
రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక విదర్భ సమస్యపై ఆసక్తి చూపించారు. 1988లో తన క్యాబినెట్ సహచరుడు పీఏ సంగ్మాకు ఈ అంశాన్ని అప్పగించారు. పూర్వాపరాలన్నీ పరిశీలించిన సంగ్మా.. విదర్భ ఒక రాష్ట్రంగా మనగలుతుందంటూ నివేదిక ఇచ్చారు. ఆ వెంటనే రాజీవ్ నన్ను పిలిచి విదర్భ ఏర్పాటు అంశాన్ని మళ్లీ లేవనెత్తాలని సూచించారు. అయితే అపుడు మహారాష్ట్ర విధానసభకు ఎన్నికలున్నాయి. విదర్భ ఏర్పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనితో నేనూ, ఎన్‌కేపీ సాల్వే.. రాజీవ్‌ను కలిసి రాష్ట్ర ఏర్పాటుకు బదులు ఆర్టికల్ 371కింద ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదన ఇచ్చాం. అందుకు రాజీవ్ అంగీకరించారు.. మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత వసంతసాఠే ఆత్మకథ మొమొరీస్ ఆఫ్ ఏ రేషనలిస్ట్ పుస్తకంలోని భాగాలివి! ఆ రోజు విదర్భ ఏర్పాటుకు అవకాశం చేజార్చుకున్న దానికి ఫలితమేమిటి? ఆ విదర్భలోనే ఆ రాజీవ్ కుమారుడు రాహుల్‌గాంధీ వారాల తరబడి పర్యటించి, అక్కడి ఆత్మహత్యల పరంపరలో భర్తను కోల్పోయిన కళావతి అనే ఓ రైతు భార్య కడగండ్ల మీద పార్లమెంటుతోపాటు ప్రతివేదికమీదా కథలుగా చెప్పుకు తిరగాల్సివచ్చింది. ఆ విదర్భ ఇప్పటికీ అలాగే ఉంది. అక్కడ రైతుల జనాభాయే తగ్గిపోతున్నది. నాగపూర్ రోడ్లపై వలసకూలీలై బతుకుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం వెన్నెముక లేకుండా ప్రజల భవిష్యత్తును ఎంత క్రూరంగా తాకట్టుపెడతారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ!

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *