By:: కె. శ్రీనివాస్
నయాగరా జలపాతాన్ని చూసి- నిలుచున్న సముద్రం లాగా ఉన్నది- అన్నాడట తమిళ కవి వైరిముత్తు. పోలిక అద్భుతమే అయినా, నీళ్లను నీళ్లతో పోల్చగలిగే సులువు అందులో ఉన్నది.
నల్లగొండ సభావేదిక మీద తెల్లదుస్తుల బవిరి గడ్డపు ఆ మనిషిని చూసినప్పుడు మాత్రం మంచినీళ్లకు లాల్చీపైజమా తొడిగినట్టు కనిపించింది. అతని చూపులు దాహంతో తీక్షణంగా ఉన్నాయి. అతని మాటలు ఎత్తిపోతల్లాగా ఎగిరి దుముకుతున్నాయి. జ్ఞాపకాలను, చరిత్రను, బాధానుభవాలను తట్టిలేపి అతను సొరంగ స్వప్నానికి మళ్లీ రెక్కలు తొడుగుతున్నాడు. దుశర్ల సత్యనారాయణ. నల్లగొండకు జలభిక్ష పెట్టింది అతనే అంటే అతిశయోక్తి అవుతుంది కానీ, అతనూ అతనితో నడచిన జనమూ అంటే మాత్రం అందులో అబద్ధం ఏమీ లేదు. కృష్ణ పక్కనే పారుతున్నా, సేద్యం ఒక మృగతృష్ణగా, నేల బోరుబావుల క్షతగాత్రిగా, మంచినీరు విషంగా మారిపోయిన నల్లగొండలో, సుమారు ఇరవయ్యేళ్ల కిందట జలసాధన సమితి పేరుతో దుశర్ల ఒక ప్రయత్నం ప్రారంభించారు. దుర్భిక్ష రైతాంగాన్ని, ఫ్లోరోసిస్ బాధితులను హైదరాబాద్ వీధుల్లోకి తరలించారు, వందలాది మంది తో నామినేషన్లు వేయించి నల్లగొండ పార్లమెంటు స్థానం బ్యాలట్ పత్రాన్ని నల్లగొండ బావుల చేంతాడంత విస్తరించారు.
ముఖ్యమంత్రుల ముందు నివేదనలు చేయించారు. చివరకు ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఆందోళన చేయించారు. ప్రధాని వాజపేయి ముందు ఫ్లోరైడ్ పంజా తిన్న వికలాంగులను ప్రవేశపెట్టారు. మంచినీళ్లు కావాలి మహాప్రభూ అని దిక్కులు పిక్కటిల్లేలా ఆక్రోశించారు. తిరుమల వెంకన్న ముందు వేలాదిమంది చేత మొరపెట్టించారు. శ్రీశైలం జలాశయంలో మెడలోతు నీళ్లలో నిరసన తెలిపారు. నాయకత్వంలో దృఢత్వం, ఉద్యమరూపాల్లో సృజనాత్మకత, లక్ష్యశుద్ధితో పాటు చిత్తశుద్ధి జలసాధనసమితి ప్రదర్శించిన సుగుణాలు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం ఆశయం సిద్ధించలేదు కానీ, ఎత్తిపోతల ద్వారా నల్లగొండ జిల్లాలోని కొన్ని జలాశయాలకు కృష్ణ నీళ్లు తరలిస్తున్నారు. నల్లగొండ పట్టణంతో సహా ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు పాక్షికంగా మంచినీటి వసతి ఏర్పడింది.
జలసాధన సమరం పేరుతో సత్యనారాయణ చెప్పిన ఉద్యమ ఆత్మకథనం ఆవిష్కరణ మార్చి మూడోతేదీన నల్లగొండలో జరిగింది. రెండు దశాబ్దాల నుంచి ఆయనతో పాటు నినదించినవాళ్లు, నడచినవాళ్లు అందరూ ఆ సభలో చరిత్రను ఉద్వేగపూరితంగా నెమరువేసుకున్నారు. సత్యనారాయణ, ఆయన నిర్మించిన సంస్థా, ఉద్యమమూ అనేక ఒడిదుడుకులకు లోనయి ఉండవచ్చు. వివాదాల్లోనూ పడి ఉండవచ్చు. ఉద్యోగం పోగొట్టుకుని, ఉద్యమానికీ దెబ్బలు తగిలి ఆ మనిషే శిథిలం అయి ఉండవచ్చు. కానీ బ్యాంకు అధికారిగా, విద్యావంతుడిగా సిద్ధించిన భద్రమయిన మధ్యతరగతి జీవితాన్ని వదులుకుని, ఒక ప్రాణావసరం కోసం, ఇదంతా సాధ్యమయ్యేది కాదులే అని కాకలు తీరిన జిల్లా రాజకీయ నేతలే పెదవి విరిచిన సమస్య పరిష్కారం కోసం, దుశర్ల ముళ్లబాటలో నడిచాడు. ఇదంతా మలిదశ తెలంగాణ ఉద్యమం అలుముకున్న తరువాత, ఆ ఉరవడిలో చేసినది కాదు. ఇటువంటి అనేక స్థానిక ఉద్యమాలే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించాయి.
ఈ దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి, ప్రాంతానికి సరైన నాయకత్వం లేదని, ఉన్న నాయకత్వానికి సామర్థ్యం, విశ్వసనీయత, ప్రజానుకూల దృష్టి లేదని తరచు అనుకుంటుంటాం. కానీ, క్షేత్రస్థాయిలో అసాధ్యమైన పనులు చేసి, జనాభిమానాన్ని కూడగట్టుకున్న నిజమైన జననేతలను మనం పరిగణనలోకి తీసుకోము. ఒక విశాలమైన, స్థూలమైన స్థాయిలో నాయకత్వం అందించగలిగే మనుషుల కోసం వెదకడంలోనే పొరపాటు ఉన్నదేమో? సత్యనారాయణ ఆచరణానుభవాలు గత ఉద్యమానికి సంబంధించినవి కావచ్చు. కానీ, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు మన ముందే కనిపిస్తున్న వ్యక్తి. నల్లగొండ జిల్లాలోని ఆలగడప గ్రామంలో గ్రామస్వపరిపాలనను అతి ప్రజాస్వామికంగా పారదర్శకంగా నిర్వహిస్తూ కొత్త విలువలను ఆవిష్కరిస్తున్నారు.
పాతికేళ్ల కిందట జనసంరక్షణ సమితి పేరుతో అడ్డగుట్ట గుడిసెవాసులకు తలలో నాలుకై వ్యవహరించిన జి. ఎం. అంజయ్య, పదిహేనేళ్ల కిందట రైతుసేవాసమితి పేరుతో వరంగల్లు సంక్షుభిత రైతాంగానికి ఆత్మవిశ్వాసాన్ని, పరస్పర సహాయ వ్యవస్థను కల్పించే అం దించే ప్రయత్నం చేసిన కాసర్ల రామిరెడ్డి, పదేళ్ల కిందటి దాకా బాలగోపాల్ మార్గదర్శనంలో కృష్ణాజలాల పునఃపంపిణీ ప్రయత్నం, కరువు వ్యతిరేక పోరాటం నిర్వహించి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతాంగ సమస్యలను చర్చలోకి తెచ్చిన రాఘవాచారి, సోంపేటలో ఊరిని ఒక్కతాటి మీదికి తెచ్చిన డాక్టర్ కృష్ణమూర్తి, ఇనుపలారీల మృత్యువిహారం గురించి విస్తృత ప్రచారం చేసిన ధనిశెట్టి లెనిన్.. ఎందరెందరో వ్యక్తులుగా బృందాలుగా సంస్థలుగా సమూహాలుగా నిప్పును రాజేయడానికే కాదు, బాధితులకు ఉపశమనం కలిగించడానికి కూడా ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. వీరు కదా, విస్తృత ప్రజా ఉద్యమాలను ఇటుక ఇటుకగా నిర్మించినవారు!
ఆశ్చర్యమేమిటంటే, ఈ చిన్న చిన్న స్థానిక ఉద్యమాలు నిర్మాణమయిన చోట జాతీయ, ప్రాంతీయ రాజకీయపక్షాలన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. వారెవరికీ అక్కడి జనజీవనంలోని ప్రాణావసరాలు కానీ, ముంచుకు వస్తున్న ప్రమాదాలు కానీ స్ఫురించవు. కొత్త మనుషుల గొంతులోనుంచి జన ఆకాంక్షలు వ్యక్తమై, వాటిని నెరవేర్చుకునే ప్రయత్నాలు రక్తసిక్తమయ్యాక కానీ, వాటి చుట్టూ కొన్ని ఓట్లున్నాయని అర్థమయ్యాక కానీ పార్టీలు రంగప్రవేశం చేయవు. జనంతో సజీవ సంబంధం కోల్పోయిన సంస్థల నుంచి ప్రజానాయకత్వం ఎట్లా వస్తుంది?
ఈ దేశాన్ని పాలించబోతున్నామని రాహుల్‌గాంధీ, నరేంద్ర మోడీ చేస్తున్న బెదిరింపుల వల్ల భయకంపితులం అయినప్పుడు, అగ్రరాజ్యాలు మనల్ని ఇంకా ఇంకా పీల్చిపిప్పిచేయడం ఖాయమని నిర్వేదానికి గురి అయినప్పుడు- మనచుట్టూ ఉన్న మనుషుల్లోని నీటి మనుషులను, మట్టిమనుషులను, వనరులను కాపాడడానికి చెట్లను, గుట్టలను కావలించుకుంటున్న మనుషులను గుర్తుకు తెచ్చుకుంటే, భవిష్యత్తు మీద, ప్రపంచం మీద కొద్దిగా ఆశ కలుగుతుంది. పర్వలేదు, ప్రత్యామ్నాయాలున్నాయని నమ్మబుద్ధి వేస్తుంది.
జలపాతాలను చూసి మాత్రమేనా కవిత్వం చెప్పగలిగింది? చిన్న చెలిమెల్లో కూడా పాట పలుకుతుంది.