రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, టీ పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, టీడీపీ నేతలు, పలువురు అధికారులు, ప్రజాసంఘాల నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ, అంబేడ్కర్ రాజ్యాంగంలో హక్కులు పొందుపరచడం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు జీవించగలుగుతున్నాయన్నారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న అంబేడ్కర్ బాటలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, దళితులను అన్ని విధాలా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. రసమయి మాట్లాడుతూ, దళితుల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, దళితుల అభ్యున్నతికి గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్నదని ప్రశంసించారు.
మంగళవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ తో పాటు పలువురు కవులు, కళాకారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు విశేష కృషి చేశారని, బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, హరితహారం, అత్యుత్తమ పారిశ్రామిక విధానం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని, వాటి ఫలాలు ప్రజలకు అందాలని, ఇందుకోసం కవులు, కళాకారులు పాటలు కట్టి పాడాలని కోరారు.