mt_logo

ప్రభుత్వానికి పేరు రావొద్దనే కొన్ని పత్రికల దుష్ప్రచారం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయపై కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తున్నాయని, కమీషన్లు, కార్యకర్తల కోసమేనని ఎవరికి తోచినట్లు వారు రాస్తున్నారని, అయితే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేటలో తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హరీష్ రావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కమీషన్ల కోసమే పనులు చేపట్టాలనుకుంటే గత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలే అమలు చేసేవారిమని, అసలు మిషన్ కాకతీయలో ఇంతవరకు ఒక్క చెరువు బిల్లు కూడా చేయనేలేదు.. అలాంటప్పుడు కమీషన్లు ఎక్కడనుండి వస్తాయని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఈ టెండర్లు పిలిచి పనులు చేపట్టడం, పనుల వివరాలు అప్ లోడ్ చేయడంలోనే సర్కారు నిజాయితీ తెలుస్తుందన్నారు. పనుల వివరాలు, నాణ్యతాలోపాలపై ఫిర్యాదుకు త్వరలో కాల్ సెంటర్, మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని హరీష్ రావు చెప్పారు. తొమ్మిది జిల్లాల్లో 9వేల చెరువులను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నామని, అన్ని వర్గాలవారు ఈ పనులకు టెండర్లు వేశారని, 95 శాతం చెరువుల టెండర్లు లెస్ తోనే నడుస్తాయని చెప్పారు.

తెలంగాణ వికాస సమితి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధానకర్తగా ఉంటూ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని మంత్రి సూచించారు. ఇంజినీర్లు రాత్రనకా, పగలనకా తెలంగాణ సోయితో పనిచేస్తున్నారని, ఒకరో, ఇద్దరో నిర్లక్ష్యంగా ఉంటే పక్కన పెడతామని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, టీవీఎస్ జిల్లా అధ్యక్షుడు రంగాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *