mt_logo

తెలంగాణపై కాంగ్రెస్ నయానాటకాన్ని నమ్మొద్దు

‘తెలంగాణపై కాంగ్రెస్ అనేక డెడ్‌లైన్లు పెట్టింది. షిండే 30 రోజుల డెడ్‌లైన్ పెట్టారు. కానీ అజాద్ వారం అంటే ఏడురోజులేనా.. నెలంటే 30 రోజులేనా అన్నాడు. ఇవి ప్రపంచంలోనే లేని మాటలు. కళ్లారా చూసిన చరిత్ర. కాంగ్రెస్‌ను నమ్మొద్దు. తెలంగాణ సమాజం గుడ్డిగా విశ్వసించొద్దు. తెలంగాణ ఇచ్చినా చెయ్యిమీద గిచ్చుకునే పరిస్థితి ఉంది. సీడబ్ల్యూసీలో తీర్మానం, పార్లమెంట్‌లో బిల్లు పెట్టడమే చేస్తారు. అయినా నమ్మొదు. బిల్లు పాస్ అయితేనే నమ్ముతాం. బిల్లు పాస్‌కాకముందు చేసేవి మాయామశ్చీంద్ర మోసాలు. మహిళాబిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఆమోదం కాలేదు. మాయావతి కోరిన దళితులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందిగానీ, లోక్‌సభలో ఇంకా నానుతూనే ఉంది’ అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వేణుగోపాలాచారికి గులాబీ కండువాను కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ నయానాటకానికి తెరతీసింది. కోర్ కమిటీలో నిర్ణయం అన్నారు. ఇప్పుడు సీడబ్ల్యూసీ అంటున్నారు. అక్కడ కూడా నిర్ణయం రాదట. సోనియాగాంధీకి నిర్ణయం అప్పగిస్తూ తీర్మానం చేస్తారట. 1956నుండి నిరంతరం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు జబర్దస్తు చేసి విలీనం చేసుకున్నారు. 1969 ఉద్యమాన్ని జైళ్లపాలు చేసి ఆపారు. 13సంవత్సరాల నేటి ఉద్యమంలో బలిదానాలు, త్యాగాలు, పోరాటాలు..’ అని ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రపంచంలోనే సకలజనుల సమ్మెలాంటి ఉద్యమం రాలేదని కేసీఆర్ చెప్పారు. ‘2009లో సస్తే సచ్చిన అనుకుని అమరణ దీక్షకు దిగితే తెలంగాణ ప్రకటన చేశారు. ఆ సంతోషం 24గంటలు కూడా లేకుండా సీమాంధ్రులు రాజీనామాలు చేశారు’ అని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్ ఇంటికాడ ఎవరూ ఉండరని కాంగ్రెస్ ఎంపీ వీ హన్మంతరావు అంటున్నారని, తెలంగాణ ఇవ్వకపోతే మీ నాయకుల ఇళ్లముందు ఎవరుంటారని ఎదురుదాడి చేశారు.

తెలంగాణ వచ్చిన తరువాత పునఃనిర్మాణంలో కూడా టీఆర్‌ఎస్ ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. బానిసలను తెలంగాణ సమాజం నమ్మదని, బానిసల చేతిలో తెలంగాణను పెట్టబోమని చెప్పారు. టీఆర్‌ఎస్ ఉంటేనే తెలంగాణ సమాజానికి ఎంతో మంచిదని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు పోరాడుదామని, తెలంగాణ సాధించుకుని, ఆత్మగౌరవంతో బతుకుదామని కేసీఆర్ చెప్పారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *