mt_logo

ఆందోళనవద్దు, ఆత్మహత్యలు వద్దు: ఆ చానెళ్లు చూడొద్ద్దు, ఆ పత్రికలు చదవొద్దు

మిత్రులారా,

తెలంగాణపై రాజకీయ ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో చెప్పారు. మరో మూడు మాసాల్లో తెలంగాణ రాష్ట్రం రాబోతోంది. అయినా తెలంగాణ యువకుల్లో ఒక గుబులుంది. భయముంది. వస్తుందా, మళ్లీ ఏమైనా అవుతుందా అన్న ఆందోళన ఉంది. అనేకమార్లు దెబ్బతిన్న హృదయాలు కదా. వీటన్నింటికంటే సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి సంబంధించి సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు చేస్తున్న ప్రచారం తెలంగాణ ప్రజల్లో, యువకులు, విద్యార్థుల్లో కలవరం కలిగిస్తున్నది.

ప్రళయం వస్తుందా, బ్రహ్మాండం బద్దలవుతోందా అన్నంత సీను క్రియేట్ చేస్తున్నది. సీమాంధ్ర నాయకులను ‘బుద్ధిలేని నాయకులుగా, సిగ్గులేని నాయకులు, చేతగాని నాయకులు’గా అభివర్ణించి అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నాయి. ఒక ప్రజాస్వామిక విలువకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయిందని చెప్పడానికి బదులు, ఇదేదో అకస్మాత్తుగా, అప్పటికప్పుడు జరిగినట్టు బిల్డప్ ఇస్తున్నాయి. సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌లు కుట్రపన్ని చేసినట్టుగా చిత్రీకరిస్తున్నాయి. ఏదైనా మార్పు జరిగేటప్పుడు సీమాంధ్ర ప్రజల్లో ఆందోళన ఉండడం సహజం. ఇన్నేళ్లుగా హైదరాబాద్‌తో ఏర్పరచుకున్న అనుబంధం తెగిపోతున్నప్పుడు హృదయం కలుక్కుమనడం ఎవరయినా అర్థం చేసుకోవాలి. కానీ ఇది చారిత్రక అనివార్యం అన్నసంగతి అక్కడి ప్రజలకు ఇంతకాలం ఎవరూ చెప్పలేదు.

కాంగ్రెస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ…అన్ని పార్టీలూ గోడమీది పిల్లుల్లా వ్యవహరిస్తూ వచ్చాయి. ఇక్కడొకమాట అక్కడొకమాట మాట్లాడుతూ విధ్వంసక రాజకీయాలకు పాల్పడుతూ వచ్చాయి. ఇక్కడ విభజనకు సరేనని చెప్పిన పార్టీలు అక్కడి ప్రజలను కూడా మానసికంగా సన్నద్ధం చేసి ఉండాల్సింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందామని నచ్చచెప్పి ఉండాల్సింది. పార్టీలు ఆ పని చేయలేదు. నాయకులూ ఆ పని చేయలేదు. పత్రికలు, చానెళ్లు ఉన్మాదంతో, రకరకాల రాజకీయ ఎజెండాలతో అక్కడి ప్రజలను పార్టీలకు, నాయకులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయి. మొదటి రెండు మూడు రోజులు మామూలుగా సాగిన ఉద్యమాలు కాస్తా తర్వాత పుంజుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అత్యంత విధ్వంసకర పాత్రను పోషిస్తున్నది. వెనుకబడిపోకూడదని టీడీపీ కూడాఅందులో దూకింది. మేమేమీ తక్కువ తినలేదని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఉద్యమం చేసుకోనిస్తున్నారు. విగ్రహాలు కూలిపోతున్నాయి. కాలిపోతున్నాయి. పగులగొట్టి ఈడ్చుకుపోతున్నారు. దిష్టిబొమ్మలను చెప్పులతో కొడుతూ స్వేచ్ఛగా ఊరేగింపులు జరుగుతున్నాయి. బందోబస్తు లేదు. బారికేడ్లు లేవు. ముందస్తు అరెస్టులు లేవు. తదనంతర అరెస్టులూ లేవు. ఇవన్నీ చేయాలని, అక్కడి ప్రజలపై దమనకాండ సాగించాలనీ కోరుకోవడం లేదు, కానీ ఒకే రాష్ట్రం, ఒకే ప్రభుత్వం, రెండు రకాల ధోరణి ఎందుకు అవలంభిస్తున్నదన్నదే ప్రశ్న. సీమాంధ్ర చానెళ్లు, పత్రికలు చానెళ్లు పండగ చేసుకుంటున్నాయి. వాటిపై ఎటువంటి ఆంక్షలూ లేవు. నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్ మార్గదర్శకాలు కూడాఇప్పుడెవరికీ గుర్తు లేవు. తెలంగాణ నేతల పిల్లలు, పెళ్లాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా చానెళ్లు సంబరంగా టెలికాస్టు చేస్తున్నాయి. ఇవి చూసి తెలంగాణ పిల్లలు ఆందోళన పడుతున్నారు. తెలంగాణ వెనుకకుపోతుందేమోనని భయపడి ఒక యువకుడు ఉరివేసుకుని మరణించాడు.

తెలంగాణ ప్రజలకు, యువకులకు ఒకటే వినతి. రోజులో ఏదో ఒక సారి వార్తలకోసం తప్ప ఈ టీవీలు, పత్రికలు చూడకండి. అస్తమానం అక్కడి పరిణామాలు చూసి గుండెలమీదికి తెచ్చుకోకండి. ఆ పత్రికలు, చానెళ్ల స్వభావం అర్థమయిన తర్వాత కూడా వాటిని చూసి, ఏదో జరిగిపోతుందని భయపడి, ఆందోళనపడి, కలవరపడి, ప్రాణాలమీదకు తెచ్చుకోకండి. మనకు ఆంధ్రలో జరుగుతున్న ఉద్యమాల పట్ల ద్వేషమూ అక్కర లేదు, అలాగే కోపమూ అక్కరలేదు. వాళ్ల బాధను సానుభూతితోనే అర్థం చేసుకోండి. నిబ్బరంగా ఉండండి. నిగ్రహంగా ఉండండి. ప్రజాస్వామిక విలువలన్నీ మనవైపు ఉన్నాయి. ఆరునూరైనా తెలంగాణ వచ్చి తీరుతుంది. మనం జయించి తీరుతాం.

By: కట్టా శేఖర్ రెడ్డి
(CEO Namasthe Telangana News Paper)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *