[నమస్తే తెలంగాణ సంపాదకీయం]
తెలంగాణ రాష్ట్రం కనుచూపు మేరలోకి వచ్చిన తరుణంలో జయశంకర్‌సార్ జయంతి వచ్చింది. ఇప్పుడు అందరి మనసులో మెదులుతున్న బాధ – ఆయన బతికుండి స్వతంత్ర తెలంగాణను కండ్లార చూసుకుంటే బాగుండు అనేదే. తన జీవితం కన్నా సమాజానికి ప్రాధాన్యమిచ్చిన మహానుభావుడాయన. తెలంగాణ అంతా తన కుటుంబమే అని భావించిన పెద్ద మనిషి. ఆయన బతికుంటే స్వతంత్ర తెలంగాణకు కూడా దిశానిర్దేశం చేసెటోడు. పిల్లలను చంకలేసుకొని, జబ్బల మీద ఎక్కించుకుని వాగు దాటించి గట్టెక్కే యాల్లకు తను కాల ప్రవాహంల కలిసిపోయిండు. జయశంకర్ సార్ గొప్పతనమేమిటి అన్నది ఇప్పటికీ ఒడువని ముచ్చటే.
తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర అందరికీ తెలిసిందే. కానీ గంతేనా ఆయన గొప్పతనం, ఇంకా ఉన్నదా అనే చర్చ ఉండనే ఉంటది. ఆయనను అర్థం చేసుకోవాలంటే, తెలంగాణను తెలుసుకోవాలాయె. జనం గురించి చదువాలె. సమాజం, చరిత్ర, సంస్కృతి సమస్తం లోతులకు వెళ్ళాలె. పాలకుల స్వభావం, రాజ్యం అణచివేత ఎట్లా ఉంటదో తెలుసుకోవాలె, ఉద్యమాల గురించి, వ్యూహాల గురించి అధ్యయనం చేయాలె. ఇదంతా సప్త సముద్రాలల్ల ఈదినట్టుంటది. ఒక్కలతోని అయ్యేది కాదు, ఒక్కనాటికి ఒడిసేది కాదు.
జయశంకర్ సార్ తెలంగాణను అర్థం చేసుకుని ఉద్యమానికి తొవ్వ చూపిన మాట నిజం. అయినా… జయశంకర్ సార్‌ను తెలంగాణకే పరిమితం చేసి చూడడం ఆయనను తక్కువ చేయడమే. సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలె, సిద్ధాంతాన్ని ఎట్లా అన్వయించాలె, ఉద్యమాలు ఎట్లా వస్తాయి, వ్యూహాలు ఎట్లా ఉండాలె మొదలైనవన్నీ ఉద్యమకారులు జయశంకర్ సార్ నుంచి నేర్చుకోవచ్చు. కానీ ఆయన ఉద్యమ జీవితం సుదీర్ఘమైనది. ఆలోచన లోతైనది. ఆయన ఆచరణలో, ఆలోచనల్లో స్థానికత ఉన్నది. ప్రజల ఆకాంక్షను గుర్తించి ముందుకు పోతే జనం తప్పనిసరిగా కదలివస్తరని ఆయన నమ్మిండు. ప్రపంచీకరణ సోకులకు పడిపోయి జనం ఉద్యమాలకు దూరమవుతున్నరని ఆయన ఎన్నడూ అనుకోలేదు. ఉద్యమకారులు చేయవలసిన మొదటిపని జనం గురించి తెలుసుకోవడం. తాము ఎక్కడ పనిచేస్తున్నమో ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సామాజిక తీరు తెన్నులు అధ్యయనం చేయడం.
జనం మనసు తెలుసుకోవడం. జనం కష్టాలకు సవాలక్ష కారణాలు ఉంటాయి. అణచివేత స్వరూపాలు అనేకం. కానీ మౌలిక సమస్య ఏమిటో, ప్రధాన శత్రువు ఎవరో పసిగట్టడం అన్నిటి కన్నా కీలకం. అణచివేత లేని చోటు భూగోళమంతా ఎతికినా దొరకదు. జనం అణచివేత నుంచి బయటపడాలనుకుంటరు. సమాజం ఎప్పుడూ మారాలని తన్లాడుతుంటది. కానీ ప్రజలు ఏ మార్పును తక్షణ ప్రాధాన్యంగా గుర్తిస్తున్నారో పసిగట్టాలె. ప్రజల ప్రాధాన్యమే ఉద్యమకారులకు శిరోధార్యం కావాలె. ఆ పోరాటాలె విజయవంతమవుతయి. జనం అనుకునేదొకటి, ఉద్యమకారులు చేసేదింకొకటి అయితే చెరోకాడ ఉంటరు. ఊదు గాలది పీరి లేవది. లోకమంత అనేక పోరాటాలు సాగుతున్నప్పుడు, తెలంగాణ వాదం ఒక అమూర్త భావన అని కొందరు భావిస్తున్నప్పుడు, జయశంకర్ సార్ జనం తక్షణ ప్రాధాన్యమేమిటో తెలుసుకున్నడు. ఆంధ్ర వలసవాదం ప్రధాన సమస్య అని గుర్తించిండు. నలుగురు మేధావులను కూడగట్టి ఆంధ్ర పాలకుల అణచివేత ఏయే రూపాలలో సాగుతున్నదో అధ్యయనం సాగించి దానినొక సిద్ధాంతంగా మలిచిండు. ఆరెస్సెస్ మొదలుకొని ఆర్‌ఎస్‌యు దాన్క అందరూ తమ ఎజెండాలు పక్కన పెట్టి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కలిసి రావాలని ఆయన పిలుపు ఇచ్చిండు. అదే ఆయన గొప్పతనం. ఆయన చెప్పిందే ప్రజలు కోరుకున్నరని రుజువైంది.
జయశంకర్ సిద్ధాంతమే కాదు, వ్యూహం కూడా చాన గొప్పది. ప్రధాన శత్రువును ఏకాకిని చేయాలని చెప్పిండు. మిగతా పోరాటాలను కలిపితే శత్రువు బలగాన్ని పెంచినట్టయితది. ఎప్పటికప్పుడు ఒక శత్రువుతోనే పోరాడాలనేది ఆయన వ్యూహం. 1969 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం ఆయనకున్నది. దాని వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలనుకున్నడు. వర్తమాన ఉద్యమాల తీరు తెన్నులు పరిశీలించిండు. అణచివేయడానికి అవకాశం ఇవ్వకుండా వ్యూహం రూపొందించిండాయన. ఎక్కడా శత్రువుకు దొరకలేదు.
శత్రువు బలం, బలహీనత, మన శక్తియుక్తులపై ఆయనకు పూర్తి స్పష్టత ఉన్నది. పాలకవర్గం ధన బలాన్ని మన జనబలంతో ఎదుర్కోవాలని ఆయన సూచించిండు. ఉద్యమం ఆయువు పట్టు ఎక్కడుందో శత్రువు చివరి వరకు పసిగట్టలేక ఓడిపోక తప్పలేదు. ఉద్యమం వల్ల సమాజం ఎక్కువగా నష్టపోకుండా పాలకవర్గాలకే ఊపిరి సలపకుండా చేయడం ఆయన వ్యూహం. ఈ పోరాట వ్యూహం వల్ల ప్రజల ఆకాంక్షలు తీర్చడం పాలకుల అనివార్యత అయింది.అంతర్గత వలసవాదంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయం – ఇవాళ విదర్భ, బోడో, గోర్ఖా వంటి అనేక ఉద్యమాలకు కొత్త ఊపిరి పోస్తున్నది. దేశానికి కొత్త రూపును దిద్దుతున్నది. అందుకే జయశంకర్ తెలంగాణకే పరిమితం కాదు. భూమి పుత్రుల పోరాటాలు ఎక్కడ సాగినా ఆయన స్ఫూర్తిదాయకం. ఉద్యమాలకు సమాజమే భూమిక అనే ఆయన సిద్ధాంతం భూగోళమంతటికీ వర్తిస్తుంది. వ్యూహమే యుద్ధ గమనాన్ని, జయాపజయాలను నిర్దేశిస్తుందన్న ఆయన విశ్వాసం ఉద్యమకారులకు సర్వదా పఠనీయం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష తీరిన తరువాత కూడా జయశంకర్ ప్రాధాన్యం తగ్గదు. ఆయన దారి చూపుతూనే ఉంటడు.