ఈరోజు శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని నోరు మూసుకో అనడంపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జరిగిన చర్చలో ఎమ్మెల్యే డీకే అరుణ తమ నియోజకవర్గంలోని ఓ బ్రిడ్జి నిర్మాణం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బ్రిడ్జి పనులను సభ్యురాలితో చర్చించి త్వరలోనే నిర్మాణ పనుల పూర్తికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అయినా డీకే అరుణ అసంతృప్తి వ్యక్తం చేయడంతో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ మీతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించనున్నట్లు వివరించారు.
అనంతరం జరిగిన చర్చలో డీకే అరుణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, మహిళలంటే గౌరవం లేదంటూ దుర్భాషలాడారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని సమీకరణాల వల్ల తమ కేబినెట్ లో మహిళలు ఉండకపోవచ్చు కానీ మీలా మహిళా మంత్రులను సీబీఐ కేసుల్లో ఇరికించలేదని, మహిళా అధికారులను జైలుకు పంపలేదని అన్నారు. మహబూబ్ నగర్ లో చేసినట్లు సభలో దాదాగిరి చేస్తే నడవదని, బంగ్లా రాజకీయాలు ఇక్కడ నడవవని స్పష్టం చేశారు.