పోలీసు శాఖకు కేటాయించిన వాహనాల్లో తొలివిడతగా వంద ఇన్నోవా వాహనాలు, మూడువందల బైకులను అందజేయడానికి ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ట్యాంక్‌బండ్‌కు కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ పోలీస్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని, నగర ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న కానుక ఇదని, రికార్డు సమయంలో పోలీసు వాహనాలను తయారుచేశామని చెప్పారు.
వచ్చే మూడు నెలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నిఘా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండేలా చేస్తామని, 24 గంటలపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నగరం ఉంటుందని స్పష్టం చేశారు. లండన్ నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల 85 శాతం నేరాలు తగ్గాయని, సీసీ కెమెరాల ఏర్పాటులో రిలయన్స్ ప్రతినిధులు తమవంతు సహకారాన్ని అందజేస్తామన్నారని గుర్తుచేశారు. నగరంలోని బంజారాహిల్స్ లో ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ పోలీస్ భవనాన్ని ఏర్పాటు చేస్తామని, అంతర్జాతీయ స్థాయిలో మన లా అండ్ ఆర్డర్ ఉంటుందని తెలిపారు.
నగరంలో పేకాట క్లబ్బులు ఉండటానికి వీల్లేదని, పేకాట క్లబ్బుల నిషేధంపై చాలామంది మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా రన్నింగ్ బస్ ఎక్కే పద్దతి పోవాలని, ఇందుకోసం రవాణాశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఏం జరిగినా పోలీసులకు సమాచారం తెలిపే సంస్కృతి పెరగాలని వివరించారు. అనంతరం డీజీపీ అనురాగ్ శర్మ మాట్లాడుతూ, సీఎం విజన్ లో భాగమే ఈ వాహనాల పంపిణీ అని, హైదరాబాద్ ప్రపంచస్థాయి పోలీసింగ్ వ్యవస్థను సంతరించుకోనుందని అన్నారు.