సోమవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా సమన్వయ పర్యవేక్షణ సమావేశం(దిశ) నిర్వహించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన గూగుల్ యాప్ ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి దిశ కమిటీ ఛైర్మన్, ఎంపీ మాలోత్ కవిత, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ లు తమ నివాసాల నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, పింఛన్ విషయంలో వృద్ధులను ఇబ్బంది పెట్టకుండా వారి నివాసాలకు వెళ్ళి పింఛన్ సొమ్ము అందించాలని సూచించారు. విద్య, వైద్యం, ఉపాధి, గిరిజన అభివృద్ధి, కోవిడ్, రహదారులు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.
సత్యవతి రాథోడ్, కవిత మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో పాడిపరిశ్రమలు ఉధృతం చేయాలని, గిరిజన ప్రాంతాల్లో రోడ్లను బాగుచేయడంతో పాటు, ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలన్నారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. నెల్లికుదురు ఎంపీపీ విజ్ఞప్తి మేరకు మండలానికో 108 అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డోర్నకల్ పీహెచ్ సీకి మహిళా డాక్టర్ విషయంపై అడుగగా జిల్లాలో ఆరుగురు డాక్టర్లను నియమించగా ముగ్గురు రిపోర్ట్ చేశారని, మిగతా వారి కేటాయింపుపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఆన్ లైన్ ద్వారా మొత్తం 27వేల మందికి విద్య అందించేందుకు ప్రణాళిక రూపొందించామని, డోర్నకల్ కు జూనియర్ కాలేజీ మంజూరు చేస్తామని చెప్పారు. అండర్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, బ్యాంకుల ద్వారా మున్సిపాలిటీల్లో అత్యధిక రుణాలు ఇచ్చేలా అధికారులు చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ రహదారుల అభివృద్ధిపై వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.