షెన్‌జాన్ నగర పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సమావేశమై తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. జెడ్‌టీఈ కి చెందిన యూనిట్లను తెలంగాణలో ఏర్పాటుచేయడం పట్ల సీఎం కేసీఆర్, కంపెనీ ప్రతినిధుల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్, చైనా కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్(సీసీపీఐటీ) ప్రతినిధులతో సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు, ఇతర ప్రయోజనాలను తెలియజేశారు.
సీసీపీఐటీ ప్రతినిధులతో సమావేశం అనంతరం షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్ ను సీఎం బృందం సందర్శించింది. ముందుగా మొబైల్ రంగంలో పేరెన్నికగన్న జెడ్‌టీఈ కార్పొరేషన్ కార్యాలయంలో ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైంది. జెడ్‌టీఈ చైనా ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్, మొబైల్ రంగంలో టాప్-5 స్థానంలో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా టాప్-10 స్థానాన్ని దక్కించుకుంది. షెన్‌జాన్ హైటెక్ ఇండస్ట్రియల్ పార్క్(షిప్) ను సందర్శించిన సీఎం కేసీఆర్ దీన్ని అభివృద్ధి చేసిన తీరుపై షిప్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. నాన్సన్ జిల్లాలో 11.5 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ పార్క్ వ్యాపారవేత్తలకు అంతర్గత సేవలు, పరిశోధనలు, పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తున్నది. ఐబీఎం, కాంపాక్, ఒలింపస్, ఎప్సన్, ఫిలిప్స్, హ్యారీస్ అండ్ థామ్సన్, ల్యూసెంట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈ పార్క్ ఆకర్షించింది. అంతేకాకుండా చైనా దేశీయ కంపెనీల్లో పేరెన్నికగన్న లెనొవా, జెడ్‌టీఈ, టీసీఎస్, గ్రేట్ వాల్, పవరైజ్, స్కైవర్త్, హువాయ్ తదితర సంస్థలు కూడా ఈ షిప్ లో కొలువయ్యాయి.