mt_logo

అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఘాటు చర్చ

శుక్రవారం నాటి శాసనసభా సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. వైసీపీ సభ్యులు మొదట సమైక్య తీర్మానం చేయాలని పట్టుబట్టగా, సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల నినాదాలతో శాసనసభ అట్టుడికిపోయింది.స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా, బిల్లుపై ఓటింగ్ కు అంగీకరించలేదని సభ నుండి వాకౌట్ చేస్తున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యే విజయమ్మ చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ బద్ధంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అన్ని పార్టీలు అనుకూలంగానే స్పందించాయని, ఇప్పుడెందుకు మాటతప్పుతున్నారని సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు.

బిల్లుపై చర్చ మొదలవ్వగానే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 60 దశాబ్దాల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసుందామని సీమాంధ్ర సభ్యులతో అన్నారు. తెలంగాణ సమస్యలపై ఎవరూ దృష్టి పెట్టలేదని, రెండు జీవనదులున్న తెలంగాణకు నీరు లేకుండా సీమాంధ్రులు ఎడారి చేశారని, నల్గొండ జిల్లాకు తాగునీరు కూడా లేకుండా ఫ్లోరైడ్ బాధితుల్ని చేశారన్నారు. నా తెలంగాణ బోర్లు వేసీవేసీ బొక్కబోర్లా పడిందని వాపోయారు. నీటి ప్రాజెక్టులపై జరుగుతున్న అవకతవకలపై సీమాంధ్ర పాలకుల చర్యను దుయ్యబట్టారు. నీళ్ళు, నియామకాలు, నిధుల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటమని, 22,400 ఉద్యోగాలను ఆంధ్రా వాళ్ళు దోచుకున్నారని, పెద్దమనుషుల ఒప్పందాన్ని అనుసరించకుండా నీలం సంజీవరెడ్డి చేయడం ద్వారా ఆంధ్రా పెత్తందారీతనం మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాలాంధ్ర ఏర్పాటు వెనుక సామ్రాజ్యవాద కోరిక ఉందని నెహ్రూ ఎప్పుడో చెప్పారని ఈటెల రాజేందర్ తెలిపారు. ఆనాడు మద్రాస్ నుండి విడిపోవడానికి 40 సంవత్సరాలు పోరాటం చేసిన సీమాంధ్రులు మద్రాస్ మాదే అంటూ గొడవపెట్టారని, ఈ రోజు హైదరాబాద్ కూడా మాదేనని కుట్రలు చేయడాన్ని ఇక్కడెవరూ ఊరుకోరని హెచ్చరించారు.తెలంగాణ బిల్లు తమకెంతో పవిత్రమైనదని, బిల్లు ప్రతులను సీమాంధ్ర నేతలు చింపివేయడం, కాల్చివేయడం తమను బాధించిందని అన్నారు. ఒకానొక దశలో సీఎం కు, రాజేందర్ కు మధ్య వాగ్యుద్ధం జరిగింది. తెలంగాణ వారిని అడ్వకేట్ జనరల్ పదవి ఇవ్వలేదని రాజేందర్ అడుగగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ, మీ తెలంగాణ సీఎంలు ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. అప్పుడు ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ, మా నలుగురు ముఖ్యమంత్రులను ఆరేళ్ళు కూడా పదవిలో ఉంచకుండా దించివేయడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయలేకపోయారన్నారు. హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములను అమ్ముకోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. బిల్లుకు అమరుల రక్తం అంటుకుని వుందని, బిల్లును అవమానపరిస్తే ఊరుకునేదేలేదని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఒళ్ళంతా కాలుతుంటే జై తెలంగాణ అంటూ అమరవీరులు కళ్ళు మూసారని ఆవేదన వ్యక్తం చేశారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ సాధించారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైనా కాపాడుకుంటామని రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చే శక్తీ, తెచ్చే శక్తీ తమకు లేదని జగన్ చెప్పలేదా అని గుర్తు చేశారు. తర్వాత సీపీఐ ఫ్లోర్ లీడర్ గుండా మల్లేష్ మాట్లాడుతూ, సీఎం ఒక ప్రాంతానికే చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నారని, ప్రజలు తెలంగాణ మాత్రమే కోరుతున్నారని, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని అంబేద్కర్ అన్నారని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ సభను జనవరి 17కు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *