By: చందా రాములు
ఈ చర్చ స్థలం హైదరాబాదు రేడియోస్టేషన్ ముందు ఉన్న బస్‌స్టాండ్/బస్‌షెల్టర్ పక్కన. నవంబర్ 1న 11 గ.లకు అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్థూపం ముందు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు మాకు ఒక దుర్దినమని తెలపడానికి, నల్ల రిబ్బన్‌లు ధరించి ‘మౌన ప్రదర్శన’ చెయ్యడానికి మా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (టి.ఎస్.సి.ఏ.) సభ్యులం జమైనాము. ప్రదర్శన పిదప ముందు చెప్పిన బస్ షెల్టర్ పక్కన అందరూ వెళ్ళిపోయిన పిదప నలుగురం ఉండిపోయి చర్చిస్తున్నాం. ఇంతలో ఒక పరిచయంలేని వ్యక్తి మా చర్చలోకి దూరినాడు. తన పేరు చల్లా అనంత పద్మనాభస్వామియని ఆంధ్రప్రభ ఎడిటోరియల్స్ అప్పుడప్పుడు రాస్తుంటానని చెప్పుకొచ్చాడు. మొన్న అంటే అక్టోబర్ 30న ప్రభలో చూడండి అంటూ తన అభిప్రాయాలను మా ముందు చర్చకు తీసుకొచ్చాడు. రేడియోస్టేషన్లో కూడా అప్పుడప్పుడు ప్రసంగించేందుకు వస్తుంటానని చెప్పుకొచ్చాడు. వి.ఎచ్, కాకా వంటి తెలంగాణా నాయకుల వల్ల, లగడపాటి, రాయపాటి వంటి సీమాంధ్ర నాయకుల వల్ల ఇప్పుడు రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు ఉత్పన్నమైనాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడి తెలంగాణా వాళ్ళకు ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుందని గతంలో వ్యాసాలు రాశానని, అట్ల ఇచ్చివుంటే వేర్పాటు సమస్య వచ్చేది కాదని అవేదనపడ్డాడు. మాలో ఒకరైన సూర్యం గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఏమన్న మాకు బిచ్చం ఏస్తే బాగుంటుందంటున్నరా? అని ప్రశ్నించాడు. ముప్పై సంవత్సరాలకింద అనాల్సిన మాటలు ఇప్పుడెందుకు అంటున్నారని, ఎప్పుడో ఇవ్వాల్సిన సలహాలు ఇప్పుడిస్తున్నారెందుకు? అని నేనూ ప్రశ్నలు సంధించాను. ఇంతెందుకు మీరిప్పుడు రేడియోస్టేషన్లో ప్రసంగించేందుకు వచ్చారు, మమ్మల్ని అందులో కాళ్ళు కూడా పెట్టనివ్వరు అని కూడా నా అభిప్రాయాన్ని చెప్పాను.
తదుపరి నా వాదనను కొనసాగిస్తూ పద్మనాభ స్వామి(మాతో మాట్లాడుతున్న/వాదిస్తున్న వ్యక్తి) గారు అక్టోబర్ 30వ తేదీన ఆంధ్రప్రభలో మీరు రాసిన ‘రాష్ట్ర సమైక్యతే ఇందిరమ్మకు ఘన నివాళి’ అని రాసిన వ్యాసాన్ని నేను చదివానని ఒక కౌంటర్ వ్యాసం రాయాలని ఉందని, కాని మీ వాళ్ళు వెయ్యరని, అందుకే రాయాలని ఉండదు అన్నాను. ‘జూబిలీహిల్స్‌లో ఉన్న మా ఆఫీసుకు రండి నేను వేయిస్తాను’ అని ఆయన సమాధానం. అతని వ్యాసం మొత్తం ఇక్కడ రాయలేను కనుక ఓఫిక ఉన్నవాళ్ళంతా ఆరోజు (30వ అక్టోబర్) ఆంధ్రప్రభను దొరికించుకొని చదవాలని ఇప్పుడు నేను రాస్తున్న స్పందనను చదువుతున్నవారికి మనవి. వారితో (ఏ.పి.స్వామి గారితో చెసిన వాదనలను) చేసిన వాదనలొని నా నిజాయతీని గుర్తించాలని, హేతుబద్ధతను గ్రహించాలని మనవి చేస్తున్నాను. నావైపు వాదనను మాత్రమే ఇప్పుడు మీముందు ఉంచుతున్నాను.
1. తన వ్యాసంలోని మొదటి పేరాలోనే అప్పట్లో (ఆమె పాలనా సమయంలో) ఇందిరమ్మను ఎవరెవరో ప్రశంసించిన మాటలను, వ్యక్తం చెసిన అభిప్రాయాలను ప్రస్తావించి ’69 ఉద్యమం తరువాత ఎంత వత్తిడి వచ్చినా సమైక్య రాష్ట్రాన్ని నిలబెట్టిన తీరును, ఇందిరమ్మ ధృడ నిర్ణయాన్ని పద్మనాభంగారు ప్రశంసించారు. మీరు ఒకవేళ అప్పట్లో “ఔను రాష్ట్రం వేర్పాటు కావాలని తెలంగాణా వాళ్ళు కోరడం సమంజసం” అని ఇందిరమ్మ అనిఉంటే మీరు ఇదే తీరుగా ఆమెను ప్రశంసిస్తూ వ్యాసం రాసి ఉండే వారా? అని నేను ఆయన్ను సూటిగా ప్రశ్నించాను. అందుకు అతను సమాధానం చెప్పలేక ఆలోచనలో పడిపోయాడు.
2. మరో పేరాలో ప్రతేక రాష్ట్ర డిమాండు చేస్తున్న వారిలో ‘వెనకబాటుతనం, అన్యాయాలకు గురికావడం అనేవి ఉమ్మడిగా కనిపించే లక్షణాలు అని రాస్తూ, దోపిడీ స్వభావం గలవారు తమ రక్తసంబంధీకులను కూడా వదలకుండా దోపిడీ చేస్తారని, కనుక తమ సీమాంధ్రులు తెలంగాణాలో సాగించిన దోపిడీ అనేది అంత పేర్కొనదగిన పెద్ద అంశమేమీ కాదన్నట్లు చెప్పిన విషయాన్ని ప్రస్తావించాను. మరి దోపిడీ అంత సహజమైనదే ఐనప్పుడు మద్రాసునుండి ఎందుకు వేరుబడే పోరాటం చేశారు? అని నేను ప్రశ్నించాను. మీరు చెప్తున్న గొప్ప నీతిసూత్రాలు అప్పుడే రాసి ఉండిఉంటే బాగుండేదికదా! అని కూడా అన్నాను. దానికి కూడా మా అందరివైపు ఒక చూపును విసిరాడే తప్ప సమాధానం చెప్పలేదు. కొంతసేపటికి “నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి కదా!” అని అన్నాడు.
3. తమ, తమ రాజకీయ ప్రయోజనాల కొరకు కాకుండా జాతి విశాల ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకొని ప్రతి పార్టీ నిర్ణయాలు తీసుకోవాలని కూడా పద్మనాభం గారు తన వ్యాసంలో సలహా ఇచ్చారు. ఐతే స్వతంత్రం వచ్చిన పిదప 15 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కనీసం బి.జె.పి. హయాంలో ఏర్పడ్డ ఆ మూడు కొత్త రాష్ట్రాల సమయంలో ఈ రచయిత తన వ్యాసాలు రాసి ఉండి ఉంటే వారి వ్యక్తిత్వాన్ని శంకించే వీలు కలిగేది కాదు.
4. చివరి పేరాలో నీళ్ళు, నిధుల పంపకంలో పారదర్శికతను పాటిస్తూ వచ్చి వుంటే తాజా ఉద్యమం తెరమీదికి వచ్చి ఉండేది కాదన్నారు. అది మాత్రం నిజమే. 610 జి.ఓ ను అమలుపరచి గతంలో అక్రమంగా కైవసంచేసుకున్న ఉద్యోగాలను సమతుల్యం చేసేందుకు కొత్తవాటిలో సగానికైనా, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల్లో మొత్తం తెలంగాణా వారికి ఒకటి, రెండు సంవత్సరాలన్నా ఇచ్చి ఉంటే ఈ ఉద్యమం వచ్చేది కాదు అని నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను. ఐతే ఇప్పుడు అటువంటి సలహాలన్ని మా తెలంగాణా ప్రజలకు కుతంత్రాలుగా కనిపిస్తున్నాయి. కనుక కలిసిఉండే మాట మరచిపోయి విడిపోయి కలిసుందామనే ఆలోచన చెయ్యాలని మనవి చేస్తున్నాను.