-దేశానికి ఆదర్శంగా గుల్బర్గా ప్రాజెక్టు
-ప్రజా ఉద్యమంగా సాగిన అభివృద్ధి
-30 లక్షల మందికి అందిన సేవలు
సవాల్‌రెడ్డి: ఎస్‌కే డే అని అందరూ పిలిచే సురేంద్ర కుమార్ డే సామాజికాభివృద్ధి పథకం (కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు) ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ప్రారంభించినా దేశవ్యాప్తంగా దాని పేరు ప్రతిష్ఠలు మార్మోగింది మాత్రం మన రాష్ట్రంలోనే. నాటి మన హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఈ ప్రాజెక్టులను పరుగులు తీయించారు. ఆ కాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న గుల్బర్గా ప్రాజెక్టు దేశానికంతటికీ రోల్ మాడల్ అయింది. మన రాష్ట్రంలో ఈ పథకం విజయవంతం కావడాన్ని చూసి ప్రశంసించిన కేంద్రం అదనంగా 16 కమ్యూనిటీ ప్రాజెక్టు కేంద్రాలు కేటాయించింది. ఈ మేరకు సిఫారసు చేసింది కూడా ఎస్‌కే డేనే.
1952లో శ్రీకారం..: 1952 అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏడు సామాజికాభివృద్ధి బ్లాకులను మన రాష్ట్రంలో ఏకకాలంలో ప్రారంభించారు. అవి క్రమంగా విస్తరించి 1955 నాటికి 17 జిల్లాల్లో 17 బ్లాకులకు పెరిగాయి. నాటి విధానం ప్రకారం ఈ పథకం కింద ఒక సామాజికాభివృద్ధి బ్లాకు, ఒక జాతీయ వికాస కేంద్రం ఉండేవి. ఈ రెండింటి లక్ష్యాలు ఒకే రకమైనవైనా బడ్జెట్ కేటాయింపుల్లో తేడాలుండేవి. కమ్యూనిటీ బ్లాకుకు రూ.45 లక్షలు, వికాస కేంద్రానికి రూ 8.5 లక్షలు కేటాయించేవారు.
లక్ష్యాలు…: భూముల్లో పంటలు అధికంగా పండించడం, మంచినీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుపరచడం, గృహవసతి కల్పించడం, భూములకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, రహదారుల నిర్మాణం, చిన్నపాటి వంతెనల నిర్మాణం, పాఠశాలల ఏర్పాటు, వైద్యశాలల ఏర్పాటుతో ఆరోగ్య పరిరక్షణ, పశువైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవడం, మార్కెటింగ్ వ్యవస్థను పటిష్ట పరచడం, అందుబాటులోకి తేవడం, సామాజిక విద్యావ్యాప్తి తదితర అంశాలు ఈ సామాజికావృద్ధి కేంద్రాల లక్ష్యాలు. ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సాధారణ పరిపాలనా సిబ్బంది-అధికారులు ఉండేవారు. వీరితో పాటు వ్యవసాయం, పబ్లిక్ వర్క్స్, వెటర్నరీ వైద్య సిబ్బంది, ప్రజారోగ్య శాఖ అధికారులు, సహకార శాఖాధికారులు, సిబ్బంది, విద్యారంగ సిబ్బంది ఉండేవారు.
అమలు విధానం..: ఒక్కో బ్లాకు డెవలప్‌మెంట్ అధికారి కింద వంద గ్రామాలు ఉంటాయి. ఈ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ హిమయత్ సాగర్‌లో శిక్షణా కేంద్రం ఉండేది. అన్ని బ్లాకుల్లో స్త్రీలు, పురుషులను దామాషా ప్రకారం సాంఘిక విద్యా ఆర్గనైజర్లుగా నియమించేవారు. వీరు వయోజన విద్యా తరగతులు, ప్రదర్శనలు, ఉత్సవాలు, నాటకాలు, జానపద గీతాలు తదితర మార్గాల్లో సామాజికాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేవారు. మహిళామండలులు, యువజన సంఘాల ఏర్పాటును ప్రోత్సహించి అభివృద్ధి పథంలోకి తెచ్చేవారు. గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు ప్రముఖ అంశంగా ఉండేది. పదేసి గ్రామాలకు ఒక గ్రామ సేవకుడు-సేవికలు ఉండేవారు.
30 లక్షల మందికి సేవ..
1955 నాటికి హైదరాబాద్ రాష్ట్రంలో 34 అభివృద్ధి బ్లాకులు 4 వేల గ్రామాలకు విస్తరించి 30 లక్షల జనాభాకు సేవలందించాయి. వీటి మీద 2 కోట్ల 32 లక్షలు వ్యయం చేశారు. నిధుల లేమి ఏర్పడిన సందర్భంలో ప్రజలు ముందుకు వచ్చి ధన రూపంలో, శ్రమ రూపంలో కూడా చేయూతనందించారు. ప్రజలు ఆనాడు అందించిన మొత్తం సుమారు రూ.50 లక్షల వరకూ ఉందంటే సామాజికాభివృద్ధి పథకాలు ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయని అర్థమవుతుంది. ప్రజల ఉత్సాహాన్ని చూసిన నాటి కేంద్ర మంత్రి డా. కట్టూ రాష్ట్రానికి అదనంగా నిధులు మంజూరు చేయించారు.
సాధించిన అభివృద్ధి…
ఈ పథకం కింద రాష్ట్రంలో 35 వేల ఎకరాల బంజరుభూములు సాగులోకి తెచ్చారు. 33,615 ఎకరాలకు చిన్ననీటి వనరుల కల్పన ద్వారా సాగునీరు అందించారు. ఆరు వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్ల సాగును అందుబాటులోకి తెచ్చారు. 10 వేల బావుల మరమ్మత్తుతో పాటు కొత్తగా 12వందల బావులు తవ్వించారు. 577 పాఠశాలలు, వెయ్యి వయోజన విద్యాకేంద్రాలు, వెయ్యి ఎకరాల బంజరు భూముల అభివృద్ధి, వెయ్యి ఇండ్ల నిర్మాణం, 12 వేల పాత ఇండ్ల మరమ్మతులు, 60 వేల ఎరువు గుంటల తవ్వకం, ఐదువందల మైళ్ల కొత్త రోడ్ల నిర్మాణం, వేలాది టన్నుల రసాయనిక ఎరువులు, మేలురకం విత్తనాలు రైతులకు పంచారు. ఈ అన్ని కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములయ్యారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..