హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఎంపికయ్యారు. ఈనెల 25న టీఆర్ఎస్ అభ్యర్థిగా దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆదివారం సీఎం కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెతో పాటు అన్నివేళలా స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు చేసిన కృషిని సీఎం ప్రతిసారీ గుర్తు చేస్తూనే ఉంటారు.
ఉద్యోగులకు తమ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పటికే పలువురికి సముచిత స్థానం కల్పించారు. టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసిన స్వామి గౌడ్ ఎమ్మెల్సీగా ఎన్నికై మండలి చైర్మన్ గా ఉన్నారు. టీజీవో అధ్యక్షుడిగా ఉన్న వీ శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించబడ్డారు. ఇప్పుడు తాజాగా ఉద్యోగ సంఘ నాయకుడైన దేవీప్రసాద్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
మెదక్ జిల్లాలోని అల్లీపూర్ గ్రామంలో జన్మించిన దేవీప్రసాద్ విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యోగులను నడిపించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సారధిగా ఉంటూ వస్తున్నారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు గానూ దేవీప్రసాద్ ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని, ఉద్యోగుల అభ్యున్నతికోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రశంసించారు.