బుధవారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆవిర్భావ సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈవెంట్ ఫ్రెండ్లీ సిటీ కోసం పోలీస్ విధానంపై దృష్టి పెట్టామని, పీపుల్స్ ఫ్రెండ్లీగా తయారు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్లోబల్ మార్కెట్ లో హైదరాబాద్ ను స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. భారతదేశంలోనే ఈవెంట్ హబ్ గా హైదరాబాద్ పేరుపొందిందని, ఈవెంట్ రంగంలో విస్తరించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
సింగపూర్, మలేషియా, చైనా దేశాలు టూరిజం, హాస్పిటాలిటీ రంగాలతోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధించాయని, ప్రభుత్వం తరపున జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, ఐటీ, పరిశ్రమల శాఖల సహకారంతో 52 వారాలకు 52 ఈవెంట్లను చేపట్టామని, దానికి అపూర్వ స్పందన లభించిందన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 157కు పెరిగిందని, ఇంకా 300 ఈవెంట్లకు చేరే అవకాశం ఉందని, అంటే రోజుకో ఈవెంట్ చొప్పున నిర్వహించే అవకాశం త్వరలోనే రానుందని, ఈవెంట్స్ నిర్వహణకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.