రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కరువుతో సహా వ్యవసాయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సర్కార్ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రైతులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరంగల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో 20 మంది కుటుంబాలకు తొలివిడతగా ఒక్కొక్కరికీ రూ. 1.5 లక్షల చొప్పున వరంగల్ కలెక్టరేట్ లో సోమవారం కడియం శ్రీహరి చెక్కులు పంపిణీ చేశారు. అంతేకాకుండా 31 మంది స్వాతంత్ర్య సమరయోధులకు, 23 మంది లొంగిపోయిన మావోయిస్టులకు, ఎనిమిది మంది మాజీ సైనికులకు ఇంటిస్థలాల పట్టాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా మనోధైర్యాన్ని కలిగించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరారు.
రూ. లక్ష వరకు రుణం తీసుకున్న రైతులకు రూ. 17 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిందని, 2014 మార్చిలో కురిసిన అకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ. 480 కోట్లను విడుదల చేశామని కడియం గుర్తుచేశారు. మూడేళ్ళలో కోతలు లేని విద్యుత్ ను రైతులకు సరఫరా చేస్తామని, క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను కష్టాలపాలు చేయొద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, ఇన్ చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.