శాసనసభలో ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి పథకం దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందని, దళిత ఆడబిడ్డలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ కు దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. గత ప్రభుత్వాలు దళిత ఆడబిడ్డలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని, కానీ ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అండగా ఉండటం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. కొన్ని దళిత కుటుంబాలు చదువుకోలేదని, అట్లాంటి వారికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఎలా లబ్ధి పొందాలో తెలీదని, దీనిపై అవగాహనా కార్యక్రమాలతో విస్తృతంగా ప్రచారం చేయాలని బొడిగె శోభ కోరారు.
అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖ మాట్లాడుతూ గతంలో గిరిజనులు ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక వారిని అమ్ముకునేవారు. వారిని భారంగా భావించేవారు. కానీ తెలంగాణలో ఇప్పుడా పరిస్థితి లేదు. ఆడబిడ్డల వివాహాల కోసం కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 51 వేలు ఇవ్వడం మంచిగా ఉంది. అయితే ఈ పథకంపై గిరిజన గూడెంలు, తండాల్లో అవగాహన లేదని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించినప్పుడే ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారని అన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద 41,123 మంది లబ్ధి పొందారని, ఈ పథకం కింద ఎస్సీలకు రూ. 157.4 కోట్లు ఖర్చు చేశామని, షాదీ ముబారక్ కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. 2015-16 సంవత్సరానికి గానూ ప్రభుత్వం రూ. 337 కోట్లు కేటాయించిందని, వెయ్యి గ్రామాల్లో పల్లె ప్రగతి సేవా కేంద్రాల ద్వారా ఈ రెండు పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, బీసీలకు కూడా ఈ పథకం వర్తింపజేసే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.