60 దశాబ్దాలకు పైగా పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజలు కోరుకునేది సంపూర్ణ తెలంగాణ అని, ఆంక్షల తెలంగాణ కాదని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో సంపూర్ణ తెలంగాణ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. 28 రాష్ట్రాలకు ఉన్న నిబంధనలు, అధికారాలే 29 వ రాష్ట్రంగా ఏర్పడనున్న తెలంగాణకు కూడా వర్తించాలని కోదండరాం డిమాండ్ చేశారు. బిల్లులో తెలంగాణపై 13 ఆంక్షలు ఉన్నాయని, వాటిని సవరణ చేసి పార్లమెంటులో త్వరగా ఆమోదింపజేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం 7వ తేదీనాడు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో దీక్షను ప్రారంభిస్తామని, ఈ సందర్భంగా 10 జిల్లాల నుండి తెలంగాణ ప్రజలందరూ పెద్దఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోదండరాం కోరారు. ఈ దీక్షకు అన్ని పార్టీల రాజకీయ నేతలతో పాటు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా హాజరవుతారని చెప్పారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఆంక్షలతో ఇంకా వేధించాలనుకుంటే సహించడానికి ఇక్కడ ఎవరూ లేరని, సంపూర్ణ తెలంగాణ మాత్రమే తమకు కావాలని అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని తాము గౌరవిస్తామని, ఆంక్షలు పెడితే మాత్రం ఒప్పుకోమని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇంతకుముందు తలపెట్టిన మానవహారం, సకలజనుల భేరి తరహాలో ఈ కార్యక్రమం కూడా విజయవంతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, తెలంగాణ మెడికల్ జేఏసీ చైర్మన్ లల్లూ ప్రసాద్ రాథోడ్, కొండా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సోమవారం జరిగిన తెలంగాణ లెక్చరర్ల సంఘం క్యాలెండర్ సమావేశంలో టీ జేఏసీ చైర్మన్ కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరి దశలో ఉంది. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి తెలంగాణ సమాజం మొత్తం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంద’ని అన్నారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు అక్కడి ప్రజలను మోసం చేసే విధంగా ప్రవర్తించవద్దని, ఇంత దూరం వచ్చాక తెలంగాణ ప్రక్రియ ఆగదని సీమాంధ్ర ప్రజలకు కూడా తెలుసని, కోదండరాం స్పష్టం చేశారు. సంపూర్ణ తెలంగాణ దీక్ష జనవరి 7 ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.