చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్ నుండి ప్రారంభం అవుతుందని, గ్రామ సభల ద్వారా చెరువులను గుర్తిస్తామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం సచివాలయంలో చెరువుల పునరుద్ధరణపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ హరీష్ రావు, కమిటీ మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే జోషి, చిన్న నీటిపారుదల శాఖ ఇంజినీర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, చెరువుల పునరుద్ధరణ వేగవంతం చేయాలని, అన్ని వర్గాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేస్తామని చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో మరోసారి కమిటీ సమావేశమై సిఫారసులను ముఖ్యమంత్రికి అందజేస్తుందని, రాష్ట్రంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఇసుక విక్రయించాలని అనుకుంటున్నామని, త్వరలోనే మెరుగైన ఇసుక విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు.