కాకతీయ ఉత్సవాలను రాష్ట్రప్రభుత్వం వచ్చేనెల మూడోవారంలో వరంగల్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. మూడురోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రతిపాదనలను వరంగల్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపింది. వరంగల్ ఖిల్లా, వేయిస్థంబాల గుడి, రామప్ప గుడిలో ఈ ఉత్సవాలు జరపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గంగాధర కిషన్ తెలిపారు.
కాకతీయ ప్రత్యేక నృత్యంగా పేరుగాంచిన పేరిణి నృత్యానికి ఈ ఉత్సవాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పేరిణితో పాటు జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో మూడు చోట్లా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణ కోసం దాదాపు రూ. కోటి వరకు అవసరమవుతాయని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. అంతేకాకుండా రామప్ప చెరువు మధ్యన ఉన్న ద్వీపంలో ఒక అంతర్జాతీయ ధ్యాన కేంద్రంను నెలకొల్పేందుకు జిల్లా పర్యాటక శాఖ రూ. 5 కోట్లతో 41 అడుగుల పొడవుతో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేయనుంది.