భారతదేశాన్ని కుదిపేసిన బొగ్గు కుంభకోణం కేసులో బొగ్గు శాఖ మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావు, కాంగ్రెస్ ఎంపీ, జిందాల్ పవర్ అండ్ స్టీల్ చైర్మన్ నవీన్ జిందాల్ లపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. వీరే కాక ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొంతమంది పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చింది. విషయానికి వస్తే గతంలో బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్న దాసరి జార్ఖండ్ లోని బొగ్గుగనులను 2008లో జిందాల్ కంపెనీలకు కట్టబెట్టి భారీ ముడుపులు అందుకున్నారని, హైదరాబాద్ లో దాసరికి చెందిన కొన్ని కంపెనీలకు ఈ ముడుపులు వెళ్లాయని దర్యాప్తులో తేలడంతో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది.
ఈ భారీ కుంభకోణం వల్ల దేశ ఖజానాకు 1.86లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందని, 1993నుంచి 2004వరకు, 2006నుంచి 2009 వరకు కేంద్రప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ఉదారంగా బొగ్గుగనులను కేటాయించిందని, ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ 17చార్జిషీట్లు దాఖలు చేసిందని కాగ్ నివేదిక తెలిపింది. కుంభకోణానికి సంబంధించిన అన్నిరకాల ఆర్థిక లావాదేవీలను, సంస్థల బ్యాంకింగ్, ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తుల వివరాలను రాబట్టే ప్రయత్నంలో ఈడీ ఉందని సమాచారం. అంతేకాకుండా వీరి స్థిరచరాస్తుల వివరాలను తెలుసుకోవడానికి అవసరమైన అన్ని అంశాలనూ తెలుసుకోవడానికి అవసరమైన పత్రాలను సమర్పించమని కంపెనీలను, వ్యక్తులను ఈడీ ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఇటీవల కోల్ స్కాం పై ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. గనుల కేటాయింపులో బిడ్డింగ్ ప్రక్రియను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను దాసరి ఒప్పుకోలేదని పరేఖ్ తాను రాసిన పుస్తకంలో విమర్శించారు.