‘నా తెలంగాణ కోటిరతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించి తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన మహనీయుడు దాశరథి అని సీఎం కేసీఆర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకుని తెలంగాణ గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్య అని, తెలంగాణ ప్రజల కష్టాలను, కన్నీళ్లను అగ్నిధార పేరుతో పద్యాల రూపంలో రాసి, వినిపించి ప్రజల్లో చైతన్యం కలిగించిన గొప్ప వ్యక్తని కేసీఆర్ ప్రశంసించారు.
సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో పాండిత్యం గల దాశరథి కథలు, నాటికలు, సినిమా పాటలు రాయడమే కాకుండా, రేడియో ప్రయోక్తగా కూడా తన సాహితీ సేవలను అందించారని, అలాంటి వ్యక్తుల కృషి ఫలితంగానే తెలంగాణ సమాజం నిత్య చైతన్యంతో వర్ధిల్లిందని సీఎం చెప్పారు.
జూలై 22న తెలంగాణ కవి దాశరథి 89వ జన్మదినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఆయన జన్మదిన వేడుకలు రాష్ట్రప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దాశరథి తెలంగాణ కళల కానాచి అని, అచ్చమైన తెలంగాణ బిడ్డ దాశరథి 89వ జయంతి వేడుకలు జరుపుకోవడం తనకు గర్వంగా ఉందని, అదే సమయంలో బాధ కూడా ఉందని అన్నారు.
దాశరథి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, ఆయన కుమారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆయన పేరు మీద స్మారక అవార్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలోని ఒక యూనివర్సిటీకి కానీ, విద్యాసంస్థకు కానీ దాశరథి పేరు పెడతామని, ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని, కోటి రూపాయలతో రవీంద్రభారతిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని, తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తామని కేసీఆర్ పేర్కొన్నారు.