“నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అని దాశరధి రాశారని మనలో చాలా మందికి తెలుసు. కానీ ఆయన రాసిన పూర్తి కవిత మాత్రం చాలామందికి తెలియదు.
అప్పట్లో తెలంగాణ ప్రాంతం నుండి వెలువడే పత్రిక “సుజాత”లో ఈ కవిత రాశారాయన.
ఆగస్ట్ 15, 1951 నాటి సుజాతలో ప్రచురితమైన “నా తెలంగాణ” అనే కవిత కింద చదవండి:
–
—
నా తెలంగాణ
– దాశరధి
కోటి తెలుగుల బంగారు కొండక్రింద
పరచుకొన్నట్టి సరసులోపల వసించి
ప్రొద్దు ప్రొద్దున అందాల పూలుపూయు
నా తెలంగాణ తల్లి; కంజాత వల్లి
వేయిస్తంభాల గుడినుండి చేయిసాచి
ఎల్లొరా గుహ లందున పల్లవించి
శిల్పిఉలి ముక్కులో వికసించినట్టి
నా తెలంగాణ, కోటి పుణ్యాల జాణ
మూగవోయిన కోటి తమ్ముల గళాల
పాట పలికించి కవితా జవమ్ము కూర్చి
నా కలానకు బలమిచ్చి నడిపినట్టి
నా తెలంగాణ, కోటి రత్నాల వీణ