By: విశ్వరూప్
జహీరాబాద్‌లో మొన్న జరిగిన ఒక విద్యార్థి జేయేసీ మీటింగులో మాట్లాడుతూ ప్రొ.కోదండరాం అక్కడి లోకల్ ఎమ్మెల్యే మరియు మంత్రిఐన గీతారెడ్డిపై కొన్ని విమర్శలు చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీభాయి చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తుకుచేస్తూ అటువంటి వీరనారికి గీతారెడ్డి వంటి బిడ్డ ఉండటం దురదృష్టకరం అనే ధోరణిలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో ఎలా చీలికలు తీసుకురావాలా అని చూస్తున్న కొన్ని సీమాంధ్ర పత్రికలు వెంటనే కోదండరాం విమర్శను గోరంతలు కొండంతలుగా రాయడం, దళితసంఘాలు రంగంలోకి దిగి కోదండరాం దిష్టిబొమ్మను తగలబెట్టడం, కోదండరాంపై ఎస్సి,ఎస్టీ అట్రాషిటీ కేసు నమోదు కావడం అంతా స్క్రిప్టుప్రకారం చకచకా జరిగిపొయ్యాయి.
తెలంగాణ మంత్రులను టార్గెట్ చేస్తూ ఉద్యమం చేయాలని జేయేసీ సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ నాడు నిర్ణయించింది. తదనుగుణంగానే సమావేశం జరిగిన జహీరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గీతారెడ్డిని విమర్శించడం జరిగింది. ఇదే సభ ఇంకో చోట జరిగితే అక్కడి ప్రజాప్రతినిధులను విమర్శించడం జరిగేది.
మీడియా స్థాయిని రోజురోజుకూ దిగజారుస్తున్న వేమూరి రాధాక్రిష్ణ ఏబీఎన్ ఛానెల్ నిప్పురాజేసి, పెట్రోలు పోసి పెద్దది చేసి రెచ్చగొట్టుడు కధనాలు చూపించగా మంత్రి గీతారెడ్డి, దళిత సంఘాలు దీన్ని దళితులపై దాడిగా చిత్రించడం అత్యంత దారుణం. దళిత నాయకులు కావడం వలన ఎవరూ విమర్శలకు అతీతులు కారు. ఒక ఇష్యూపై దళితేతర నాయకులు ఎంతవరకూ విమర్శలకు గురవుతారో దళిత నాయకులు కూడా అంతే.
తాను మంత్రిగా ఉన్నప్పుడూ ఏనాడూ దళిత క్షేమం పట్టని గీతా”రెడ్డి”కి, భర్త దగ్గరనుండి అరువు తెచ్చుకున్న తోకను పేరుకు తగిలించుకుని దళిత ఐడెంటిటీని పేరులోనే తొలగించుకున్న గీతా”రెడ్డి”కి ఒక్కసారిగా తాను దళిత మహిళనన్న విషయం గుర్తొచ్చింది. అనునిత్యం పీడిత, తాడిత ప్రజల పక్షాన ఉంటూ తన పేరు నుంచి రెండు దశాబ్దాల క్రితమే “రెడ్డి”ని తొలగించుకున్న కోదండరాం మాటలను, అరువుతెచ్చుకున్న “రెడ్డి”తోక తగిలించుకున్న మంత్రి “అగ్రకుల దాడి”గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించడం నీచం, దిగజారుడుతనం.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం రాజకీయంగా, ఆర్ధికంగా పోరాటం చెయ్యలేని బీదాబిక్కి దళితులకు అండగా ఉండాలి. అంతే కానీ చట్టం తన చేతిలో ఉన్న మంత్రులకు అండగా కాదు. దళిత సంఘాలు తమ కమ్యూనిటీలో వివక్షకు గురవుతున్న, అగ్రకుల దాడులకు గురవుతున్న బలహీన వర్గాలకు మద్దతుగా పోరాటాలు చెయ్యాలి, మంత్రుల వ్యక్తిగత రాజకీయాలకు మీ మద్దతు అవసరం లేదు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న దళిత యువకులపై కేసులుపెట్టి జైళ్ళొ పెట్టినప్పుడు గానీ, దళిత యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడుగానీ స్పందించని మంత్రిణి గూర్చి దళితసంఘాలు గోలపెట్టడం అనవసరం. ఇలాంటి చర్యలు ఎస్సీ, ఎస్టీ అట్రాషిటీ యాక్టును దుర్వినియోగం చెయ్యడంతో బాటు సామాన్య ప్రజానీకానికి ఈ ఆక్టు గురించి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది.
చివరగా ఉద్యమంలో చిచ్చుపెట్టి నాయకత్వాన్ని విడదీయాలని చూస్తున్న సీమాంధ్ర పత్రికలను, ఛానెళ్ళనూ తెలంగాణనుండి తరిమి తరిమికొట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది. లేకుంటే వాళ్లు ఇటువంటి కుట్రలకు తెగబడుతూనే ఉంటారు.