mt_logo

గీతమ్మ అమ్మ చెప్పిన మాట

ఈ మంత్రులు మాకెందుకు? వీళ్లలో పనికివచ్చే మంత్రులేరి?
రొట్టెముక్కలకు ఆశపడి నోళ్లు మూసుకున్నారు!
బుడంకాయ దొంగలంటే మంత్రులు భుజాలు తడుముకుంటున్నారు!
ఇంతమంది అడుగుతుంటే మంత్రులు ఎందుకు రాజీనామా చేయరు?
ఏముఖం పెట్టుకుని అసెంబ్లీలో కూర్చుంటున్నారు?
మంత్రుల తీరు సిగ్గు చేటు?

1969 మార్చి నెలలో అసెంబ్లీలో ఈశ్వరీబాయి ఆగ్రహం

ప్రొఫెసర్ కోదండరాం ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి తెలంగాణ కొరకు చేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా జహీరాబాదులో జరిగిన సభలో చేసిన ప్రసంగాన్ని సీమాంధ్ర మీడియా వివాదాస్పదం చేసింది.


ఆనాటి శాసనసభలో గీతారెడ్డి తల్లి గారైన ఈశ్వరీబాయి ప్రసంగం పూర్తి పాఠం చదవండి-

‘రెండు నెలలకు పైగా ఇక్కడ(తెలంగాణలో) గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు సాగడానికి కారణం, బాధ్యులు కాంగ్రెస్ మంత్రులు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్‌వారిపైనే నేను నేరం మోపుతున్నాను. ఈ గొడవల గురించి ముఖ్యమంత్రిగాని, మంత్రులుగాని పట్టించుకున్న పాపానపోలేదు. నేడు పిల్లలను ఉద్రేకంలోకి దించారు. అసలు విద్యార్థులు ఈ సమస్యను తీసుకోవడానికి కారణం ఏమిటి? భాషా ప్రాతిపదికపై 1956లో ఆంధ్ర తెలంగాణలు కలవాలన్నప్పుడు ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అప్పుడు తెలంగాణలో అందరికీ ఆంధ్రలో కలవాలని లేదు. మంత్రులలో కొందరు వేరుగానే ఉండాలన్నారు. కొందరు విశాలాంధ్ర కావాలన్నారు. నెహ్రూ, శాస్త్రి మీరంతా ఒక భాషవారు ఒక ఒప్పందానికి రావాలి అన్నారు. ఈనాడు ఆ ఒప్పందంమీదనే గొడవలు జరుగుతున్నాయి. దానిని జెంటిల్‌మెన్ అగ్రిమెంట్ అన్నారు….జెంటిల్‌మెన్ అగ్రిమెంట్‌లో ఒక్కటయినా అమలులోకి వచ్చిందా?…ఒక ఒప్పందం ఉన్నతర్వాత ఆ ఒప్పందం ప్రకారం ఎందుకు నడవలేదు? ఈనాడు మనలో భేదాలు రావడానికి కారణం ఏమిటి? బ్రహ్మనందారెడ్డిగారు ఆ పద్ధతిని ఎందుకు తొలగించారు? ఇప్పుడు మీకు తొమ్మిది మంది మంత్రులు ఇచ్చాము అని అంటున్నారు. ఈ మంత్రులు మాకు ఎందుకు? వీరిలో ఒక్కరు కూడా పనికి వచ్చేమంత్రిలేరు. ఈ మంత్రులు మాకు అక్కర్లేదు. ఈనాడు ఇన్ని గొడవలు జరుగుతున్నా, పిల్లలను తుపాకి గుళ్లతో కాల్చివేస్తున్నారు. అయినా ఒక్క మినిస్టర్ కూడా వచ్చి అడగలేదు. అటువంటప్పుడు మాకు ఈ మంత్రులెందుకు? కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడయినా ఈ మంత్రులుగాని, కాంగ్రెస్ సభ్యులుగాని, ఇట్లా అన్యాయం జరుగుతోందని, తెలంగాణవారికి పనులు, సర్వీసెస్‌లో ఉద్యోగాలు ఇవ్వడం లేదని, వారికి సీనియారిటీ దెబ్బతింటోందని మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాను. ఈ మంత్రులు తమ రొట్టె ముక్కలకు ఆశపడి మాట్లాడకుండా ఊరుకుంటున్నారు….

ఒకవైపు బ్రహ్మనందారెడ్డి స్టూడెంట్స్, ఇంకోవైపు వేరే స్టూడెంట్స్. మాకు వ్యతిరేకంగా ఉన్న స్టూడెంట్స్‌ను ఎక్కువ సంఖ్యలో పట్టుకుని జైళ్లలో పెట్టండని పోలీసులకు చెబుతారు వారు. పిల్లలు పిల్లల మధ్య అన్యాయాలు చేసి మంత్రులు తమ పదవులలో ఉంటున్నారు రాజీనామాలు చేయకుండా. ఒక్కరు కాదు. ప్రతిపక్షం అంతా అడుగుతోంది రాజీనామా చేయమని. విద్యార్థులు అడుగుతున్నారు. అయినా ఏ ముఖాలు పెట్టుకుని అసెంబ్లీలో కూర్చున్నారు. నిజంగా సిగ్గుచేటు. ఇప్పుడు సెక్రెటేరియట్‌లో 50 మంది ఆఫీసర్లు ఉంటే అందులో తెలంగాణ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? కీ పోస్టులు ఎవరి చేతిలో ఉన్నాయి? చీఫ్ సెక్రెటరీ ఎంటీ రాజు. ఇదివరకున్న ఇద్దరిలో కూడా మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ముంచిపోయిన నంబియారు ఉన్నారు. ఆయన సంజీవరెడ్డి అనుచరుడు. అంతకుముందు ఉన్నవారు కూడా ఎవరికో చుట్టమో…బంధువో లేక తెలిసినవారో….

మన మంత్రులకు బుడంకాయ దొంగ అంటే భుజాలు తడిమి చూసుకోవడం అలవాటు….

మంత్రి తిమ్మారెడ్డి సెపరేట్ తెలంగాణ కావాలనేవారు ట్రెయిటర్స్ అని అన్నారు. కానీ ఆ నినాదం ఎందుకు వచ్చింది? 12 సంవత్సరాలైనా పాకిస్తాన్‌లో ఉన్నామా? హిందుస్థానంలో ఉన్నామా అన్న అనుమానం వస్తోంది. ఈ పరిస్థితులకు కారణం మంత్రులు, ప్రభుత్వం కాక మరెవరు? ఈ పరిస్థితికి కాంగ్రెస్‌వారే కారకులు. అందరం కలసి మెలసి ఉండాలంటే కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *