-ఆదినుంచి వివాదాలే.. ఆదరించిన చేతిని కాటేసిన ఘనత
అహంకారం, అవినీతి, అధికారం, మూర్ఖత్వం అన్నీ కలిస్తే ఎలా ఉంటుంది. అచ్చం లగడపాటి రాజ్‌గోపాల్‌లా ఉంటుంది. పుట్టిందీ.. పెరిగింది చెప్పుకోదగ్గ జీవితం కాదు.. నడమంత్రాన వచ్చిపడ్డ సిరి. పెద్దోళ్ల ప్రాపకం, ప్రోత్సాహం నిచ్చెనలెన్నో ఎక్కించింది. కానీ ఆశలు పెరిగి ఎక్కించిన వారినే ఈ పాము మింగేసింది. గతం.. వర్తమానం ఏవీ కూడా విలువల గీటురాళ్లకు కట్టుబడేవి కావు. అసలు అలాంటి పదాలకు ఈ డిక్షనరీలో చోటే లేదు. అధికారం అరచేతిలో వాలింది. దాని ఆసరాతో అవినీతి కోట్లకు బుసకొట్టింది. ఆ బుసబుసలే ఇవాళ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో స్ప్రే రూపంలో బుస్సుమన్నాయి. దేశానికి ఈ అనుభవం కొత్త కావొచ్చు. కానీ ఆయననెరిగిన వారికి వింతేం కాదు. ప్రజాప్రతినిధిగా ఉంటూ సమస్యలపై నిలదీసిన వారిని పట్టపగలు గల్లా పట్టుకుని దవడలు వాయించిన అనుభవాలు విజయవాడ రాజకీయ పార్టీలకెరుకే. ఇంద్రకీలాద్రి సాక్షిగా దొబ్బేయ్ అనిపించుకున్నా చుట్టూ తిరిగే పాత్రికేయ మిత్రులకు తెలియక పోవచ్చు గానీ, పోలింగు బూతుల ముందట నిబంధనలు పాటిస్తున్న పోలీసులను బూతులు తిట్టిన జ్ఞాపకాలు అక్కడ పని చేసే ఖాకీలకందరికీ ఎరుకే. ప్రజాజీవితంలో ఒక్క వాగ్దానం నెరవేర్చిన దాఖలాలు లేక పోయినా పక్క పార్టీ వాడు అభివృద్ధి కోసం కట్టే ఫ్లై ఓవర్‌ను ధర్నాల దాదాగిరితో ఆపేయగలరు. రాజధానిలోని తన వేల కోట్ల ఆ వెంచర్ కోసం కోట్లాది ప్రజల ఆకాంక్షలకు సైంధవుడిలా అడ్డపడగలరు.
తెలంగాణకు అడ్డుగా..:
వెనకాముందూ ఏ చరిత్రా లేని లగడపాటి రాజకీయ చరిష్మా సాధనకోసం తెలంగాణ వ్యతిరేక నినాదం ఎత్తుకున్నారు. 2009 డిసెంబర్ 9 తర్వాత సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టడంలో లగడపాటి పాత్ర, ఆర్థిక తోడ్పాటు ఉందని తెలంగాణ వాదులనుంచి విమర్శలు వచ్చాయి. అనేక సందర్భాల్లో తెలంగాణ మీద విషం కక్కుతున్న ఆయన మీద సీమాంధ్ర రంగు డబ్బాలు మనసు పారేసుకుని లవర్‌బాయ్‌గా ఆరాధించాయి. చిన్న ధర్నా వంటి ఒక్క ప్రజాందోళనకూడా చేయకుండానే కేవలం తెలంగాణ మీద విషం చిమ్మే ప్రకటనలు, ప్రెస్‌మీట్లు, టీవీల ఫోన్‌ఇన్‌లతోనే ఆయన సమైక్య చాంపియన్‌గా మారిపోయాడు. ఆ తర్వాత జగన్, కిరణ్ అంతా ఆయనను కాపీ చేస్తున్న వారే. తెలంగాణను వ్యతిరేకిస్తున్న క్రమంలో ఆయన తెలంగాణ వాదుల ఆగ్రహాన్ని అనేక సందర్భాల్లో చవిచూశారు. ఓ సందర్భంలో ప్రెస్‌క్లబ్ మూత్రశాలల వద్ద దాదాపు అరగంట పాటు నేలమీద కూర్చోవాల్సి వచ్చినా ఫీలవుకుండా ఆ తర్వాత లేచి దుమ్ము దులుపుకుని వెళ్లిపోయారు. ఇంకో సందర్భంలో తెలంగాణ వాదుల మీద ప్రతీకారంగా కారు దిగకుండా ఉండిపోవడంతో పోలీసులు కుక్కలబండిని ఈడ్చుకుపోయినట్టు ఆయన కారును క్రేన్‌తో ఇంటిదాకా తరలించారు. అయినా గంటల పాటు కారు దిగకుండా ఉండిపోయి ఆ తర్వాత టీవీల వాళ్లు వెళ్లిపోయాక దిగి ఇంట్లో కెళ్లారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన తర్వాత విజయవాడలో ఆమరణ దీక్ష నాటకాన్ని నడిపి హఠాత్తుగా మాయమై నిరాహార దీక్షలను నవ్వుల పాలు చేశారు. పోలీసుల కళ్లు గప్పేందుకు ఓ టీవీకి చెందిన వ్యాన్‌లో దాగి హైదరాబాద్‌కు వచ్చారనే ప్రచారం జరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో పరుగుపందెం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద ప్రహసనం. రాత్రికి రాత్రి విజయవాడలో మాయమై హైదరాబాద్‌కు వచ్చి ఆటోలో అకస్మాత్తుగా నిమ్స్‌కు వచ్చిన ఆయనకోసం ఆ ఆసుపత్రిలో అక్కడ బెడ్‌ను ఎవరు.. ఎందుకు ఖాళీ పెట్టారు. ఆ బెడ్ మాత్రమే ఖాళీ ఉంటుందని ఈయనకు ముందే తెలిసి అంత వేగంగా వచ్చి జంపింగ్ చేశారు? నిక్షేపంగా ఉండి పరుగు పరుగున వచ్చిన ఆయనను ఏదో అపస్మారకంలో ఉన్నట్టు అలా బెడ్ ఎక్కగానే ఇలా ఐసీయూకు తరలించే డ్రామాకు ఆ ఆసుపత్రిలో స్కెచ్ వేసిందెవరనేది ఇంతవరకూ వెల్లడి కాలేదు. తెలంగాణకు చెందిన ప్రతి డిమాండ్‌ను ఖండించడమే కార్యక్రమంగా పెట్టుకున్న లగడపాటి ‘వాక్కు’ మీద తెలంగాణవాదులకు మాత్రం మంచి గురి ఉంది. ఆయన కాదు అన్న ప్రతి అంశం తెలంగాణ విషయంలో నిజమవుతూ వచ్చాయి. 14ఎఫ్ రద్దు కాదు అన్నారు. రాష్ట్రపతికి కూడా రద్దు అధికారమే లేదన్నారు. అది కాస్తా రివర్సయి రద్దయిపోయింది. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రానే రాదన్నారు. వచ్చేసింది. అంతెందుకు సీడబ్ల్యూసీ తెలంగాణ నిర్ణయం తీసుకోదు అన్నారు.
వాక్కు మహిమ. ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఒప్పుకోదన్నారు. జీఎంసీ అన్నారు. 371(డీ) అన్నారు. రాష్ట్రపతి అన్నారు. అసెంబ్లీ ఆన్నారు. బంగారు నాలుక.. అన్నీ చకచకా జరిగాయి. ఆఖరికి పార్లమెంటులో బిల్లు పెట్టనివ్వమని అన్నారు. గురువారం ఆ ముచ్చటా తీరిపోయింది. తెలంగాణపాలిట ఆ గోల్డెన్ టంగు ఇంకా రాష్ట్రం సాధ్యం కాదంటున్నది కాబట్టి రివర్సు తథాస్తు ఖాయమని అంతా భావిస్తున్నారు. ఆయన కంపెనీ పెద్ద ఎత్తున బ్యాంకులకు బకాయిలున్న విషయం బహిరంగ రహస్యమే.
(Courtesy by:namasthetelangana.com)