ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే భారత్–ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2500 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. స్టేడియంలో మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటిని బంజరాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేశామని, స్టేడియంలో జరిగే ప్రతి కదలికను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. స్టేడియంలోకి సెల్ ఫోన్స్, బ్లూటూత్ కు అనుమతి ఉందని… అయితే సిగరెట్, కెమెరాలు, ఆల్కహాల్, షార్ప్ ఆబ్జెక్ట్స్, వాటర్ బాటిల్స్, హెల్మెట్స్, పెట్స్, ఫైర్ క్రాకర్స్, ఫుడ్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్ కు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు.
మ్యాచ్ కోసం దాదాపు 40 వేల మంది ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియానికి వస్తారని, వారి కోసం స్టేడియానికి చేరుకోవడానికి సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో అదనపు సర్వీసులు ఉంటాయని, అర్ధ రాత్రి ఒంటి గంట వరకు మెట్రో ట్రైన్స్ నడుస్తాయని చెప్పారు. ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు రేపు సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారని, ప్రాక్టీస్ కోసం ఎల్లుండి ఉదయం వారు ఉప్పల్ స్టేడియానికి వస్తారని వెల్లడించారు. మ్యాచ్ ముగిసి వారు వెళ్లే వరకు నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని సీపీ స్పష్టం చేశారు.