కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని, కరోనా అంటే భయపడే రోగం కాదని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలంలోని మల్యాల గ్రామంలో మంత్రి సోమవారం పర్యటించారు. ఘన వ్యర్ధాల నిర్వహణ రిసోర్స్ పార్కు, కంపోస్టు తయారీ కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో గ్రామ ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రూ. 40 వేలు నిధులు సమీకరించగా మంత్రి హరీష్ రావు కూడా సొంత నిధులు రూ. 60 వేలు కలిపి ఈ సందర్భంగా మెడికల్ హెల్త్ కిట్లను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కరోనా గురించి గ్రామ ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు సూచించారు.
గ్రామంలో ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, పీహెచ్ సీ పరిధిలో ప్రతిరోజూ 50 కరోనా పరీక్షలు జరపాలని మంత్రి ఆదేశించారు. కరోనా నేపథ్యంలో అందరినీ ఆదుకోవాలని ప్రజలంతా చందాలు వేసుకుని రూ. 40 వేలు ఇచ్చారని, తాను కూడా మిగతా రూ. 60వేలు కలిపి మొత్తం రూ. లక్ష తో ఆరోగ్య కిట్స్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్యాల గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని, స్వచ్ఛ గ్రామంగా మార్చి జాతీయ అవార్డు సాధించాలని, గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరుగా చేసి ఇచ్చి చెత్తపై కొత్త సమరంలా సాగ్రిగేషన్ షెడ్ లో వర్మీ కంపోస్ట్ తయారుచేయాలని ప్రజలకు మంత్రి హరీష్ రావు సూచించారు.
ఇదిలాఉండగా మంత్రి హరీష్ రావు జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని రంగదాంపల్లి 9 వ వార్డులో స్టీల్ బ్యాంకును సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం నిషేధిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని పిలుపునిచ్చారు. స్టీల్ బ్యాంకు సామాగ్రి కిరాయి, సమగ్ర పట్టిక వివరాలు ఉన్న పత్రికలను ఆవిష్కరించారు. దీంతో పాటు 9వ వార్డులోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న కిచెన్ షెడ్ నిర్మాణ పనులకు, రూ. 20 లక్షలతో నిర్మించనున్న రెడ్డి సంఘ నిర్మాణ పనులకు కూడా మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.