చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో తెలంగాణ ప్రవాస భారతీయులు భాగస్వాములవ్వాలని, ఒక్కో ఎన్నారై ఒక్కో చెరువును దత్తత తీసుకుని ప్రభుత్వం తలపెట్టిన ఈ బృహత్తర కార్యానికి సహకరించాలని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన ఆదివారం ఎన్నారైలకు ఒక లేఖ కూడా రాశారు. సొంత ఊరికి, స్వదేశానికి దూరంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు ఎన్నారైలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన సహకారాన్ని తెలంగాణ సమాజం మర్చిపోదని హరీష్ ప్రశంసించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ అత్యంత ముఖ్యమైన అంశమని తెలిపారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో ఎంతోకాలంగా ఉన్న చెరువుల వ్యవస్థను నిర్లక్ష్యం చేసి విధ్వంసానికి గురిచేసిందని హరీష్ పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురు ఎన్నారైలు వారి ఊరి చెరువులను దత్తత తీసుకోవడానికి సంసిద్దత వ్యక్తం చేశారని, మీ ఊరి చెరువును పునరిద్ధరించాలని మీరు కోరుకుంటున్నారని నాకు తెలుసని, చెరువును దత్తత తీసుకుని నిధులు సమకూర్చగలిగే అవకాశాన్ని పరిశీలించాలని వినమ్రంగా కోరుతున్నానని హరీష్ లేఖలో వివరించారు. మీరు దత్తత తీసుకున్న చెరువుకు మీరు కోరుకున్న పేరు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వ్యక్తిగతంగా సాధ్యం కాకపోతే మీ సంఘం లేదా సంస్థ తరపున చెరువులను దత్తత తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు.
మిషన్ కాకతీయకు ఇతర రూపాల్లో కూడా నిధులు సమకూర్చగలిగే అవకాశాన్ని పరిశీలించాలని, జనవరిలో కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మీతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాలని అనుకుంటున్నానని తెలిపారు. మన ఊరు-మన చెరువు మనందరి కార్యక్రమమని, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సమిష్టిగా కృషి చేయాలని, మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలపండని ప్రవాసభారతీయులను హరీష్ లేఖలో కోరారు.