ఆదివారం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో జరిగిన మల్లికార్జునస్వామి కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొని స్వామివారికి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం నూతనంగా నిర్మించిన కురుమ భవనానికి ప్రారంభోత్సవం చేసి జాతీయ కురుమ కులసంఘం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కొమురవెల్లి మల్లన్న కళ్యాణంలో పాల్గొనడం వల్ల మనసు సంతోషంగా ఉందని, ఈ పుణ్యక్షేత్రానికి ఒక్క ఎకరం జాగా కూడా లేదని, అత్యంత సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడ భక్తుల వసతి కోసం కాటేజీలు నిర్మించుకోవాల్సి ఉందని, కొమురవెల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా అన్ని కులాలు బలపడాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినట్లుగా తెలంగాణ సబ్బండ కులాల, వృత్తుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరుమీద రాష్ట్ర రాజధానిలో అద్భుతమైన రీతిలో భవనాన్ని నిర్మిస్తామని, ఇందుకోసం ఎకరం, ఎకరన్నర స్థలం కేటాయించి భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గొల్ల కురుమలలో విద్య అంతగా లేకపోయినా వారిలో మేధాసంపత్తికి లోటులేదని, ప్రభుత్వం అందించే పథకాల ద్వారా తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.