రాష్ట్రంలో రైతుల ఇబ్బందులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలే కారణమని, కల్పిత కథలతో ఈ మూడు పార్టీలూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, ఇకనుండి విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
వరంగల్ జిల్లాలో హెల్త్ యూనివర్సిటీ పెట్టడం శుభపరిణామమని, జనాభాకు అనుగుణంగా వైద్యులను నియమించనున్నట్లు ఈటెల అన్నారు. విద్యుత్ కోతలకు గత ప్రభుత్వాల పనితీరే కారణమని, విద్యుత్ సమస్యలు అధిగమించేందుకు ఖమ్మం జిల్లా ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరులో పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ళలో కోతలు లేని కరెంట్ ఇస్తామని, రైతులు విపక్షాల మాటలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు.
