mt_logo

టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి..

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇవాళ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సునీత తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మెదక్ జిల్లా అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు లేదని మండిపడ్డారు. ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీవైపే ఉన్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నర్సాపూర్ భూములు సస్యశ్యామలం అవుతాయన్న నమ్మకం ఉందని ఆమె అన్నారు.

హరీష్ రావు మాట్లాడుతూ సునీతా లక్ష్మారెడ్డి చేరికతో మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ మరింత బలోపేతం అయ్యిందన్నారు. రోజుకో కాంగ్రెస్ నేత టీఆర్ఎస్ లో చేరుతున్నారని, రాష్ట్రంలో ఉండేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గతంలో గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు దేశ ప్రజలు తెలంగాణ మోడల్ గురించే మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వకుండా తెలంగాణను బీజేపీ చిన్నచూపు చూసింది. కేంద్రం నుండి మనకు రావాల్సిన వాటా కోసం 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు సాధించాలని హరీష్ రావు సూచించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, శాసనసభా పక్ష నేతలు కూడా ఇటీవలి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాదరణ కలిగిన సునీతా లక్ష్మారెడ్డి లాంటి నేతలు టీఆర్ఎస్ లో చేరుతుండడంతో ఇక కాంగ్రెస్ కూడా గతంలో మారనుందని, 37 ఏండ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి టీడీపీ పోటీ చేయలేకపోయిందని అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, గోదావరి జలాలతో నర్సాపూర్ నియోజకవర్గం భూములను పచ్చగా మారుస్తామని చెప్పారు. బీజేపీకి మరోసారి బుద్దిచెప్పే అవకాశం వచ్చిందని, 16 ఎంపీ సీట్లు గెలుచుకుని ఢిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా మారాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *