తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం అంతకంతకూ పెరుగుతున్నది. అభ్యర్థుల ఎంపికపై చివరినిమిషం దాకా జరిగిన రాద్ధాంతం ఒకవైపు, గ్రూపు తగాదాల కారణంగా వేయించిన పోటీ నామినేషన్లు ఒకవైపు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కేసీఆర్‌పై విమర్శల తీవ్రతను పెంచి, తెలంగాణ సాధన ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్న పొన్నాల లక్ష్మయ్యకానీ, దామోదర రాజనరసింహకానీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నారు.
కనీసం 30 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు, అసంతృప్తులు, పోటీ నామీనేషన్ల బెడదను కాంగ్రెస్ అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు ఓడించుకోవడానికి కొన్ని చోట్ల బాహాటంగా, మరికొన్ని చోట్ల పరోక్షంగా పావులు కదుపుతున్నారు. పార్టీలోని తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులతోనే నామినేషన్లు వేయించి ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది.
అసలే గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై కొంత వ్యతిరేకత (యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్) ఉంది. ఈ ఎన్నికల్లో తిరిగి పోటీచేస్తున్న సుమారు 20 మంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు యాంటీ ఇన్‌కంబెన్సీని ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ చేయించిన అంతర్గత సర్వేలలోనే తేలింది. ఇది కాకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో ఆయనతో రాసుకుని పూసుకుని తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి ‘నేను దగ్గరంటే నేను దగ్గర’ అని పోజులు కొట్టిన మంత్రులు, నాయకులపై తెలంగాణవాదుల్లో కోపం ఉంది.
ఉద్యమాల సందర్భంగా తెలంగాణవాదులపై దాడులు చేయించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరున్నారు. ఇవన్నీ ఇప్పుడు టీఆరెస్ పదేపదే గుర్తు చేస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉద్యమకారులతో కలసి వచ్చి ఉంటే మరో రెండేళ్లు ముందుగానే తెలంగాణ వచ్చి ఉండేదని, ఇంతమంది పిల్లలు చనిపోయి ఉండేవారు కాదని తెలంగాణ ఉద్యమ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇన్ని కారణాలు, పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతిష్ఠ మసకబారుతున్నది. కాంగ్రెస్ శ్రేణులన్నింటినీ ఒక్కతాటిపై నడిపించే సమర్థ నాయకత్వం లేకపోవడం కూడా కాంగ్రెస్‌కు సమస్యగా పరిణమించింది. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను కాంగ్రెస్ శ్రేణులే సీరియస్‌గా తీసుకోవడం లేదు.