mt_logo

కాంగ్రెస్ కపట నాటకాన్ని తెలంగాణ ప్రజలు నమ్మొద్దు

గత కొంతకాలంగా తెలంగాణ అంశాన్ని కోల్డ్ స్టోరేజిలొ పెట్టినట్టు కనిపించిన కాంగ్రెస్ పార్టీ గత రెండు వారాలుగా అకస్మాత్తుగా ఏదో చేయబోతున్నట్టు హడావిడి మొదలుపెట్టింది.

ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటున్నామని మీడియాకు లీకులు ఇవ్వడం మొదలుపెట్టింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులతో గత వారం నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో ఒక భారీ సభను నిర్వహింపజేసి త్వరలో నిర్ణయం అంటూ ఊరిస్తున్నది.

ఈ ప్రచారం వల్ల మన రాష్ట్రంలో కొంతమందైనా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేస్తుందని నమ్ముతున్నారు. కానీ గత ఆరు దశాబ్దాల్లో ఎన్నోసార్లు తెలంగాణ ప్రజలను వంచించిన కాంగ్రెస్ ను ఇప్పుడు నమ్మొచ్చా అని ప్రశ్న వేసుకుంటే అస్సలు నమ్మవద్దనే జవాబు వస్తుంది.

రాష్ట్రంలో ఈ నెల సర్పంచ్ ఎన్నికలు, వచ్చే నెలలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వేళ తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర ప్రాంతంలో వ్యతిరేకత వస్తుందన్న సాకుతో ఇప్పట్లో ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. నవంబరులో ఏకంగా పార్లమెంటు ఎన్నికలే పోవాలని అనుకుంటున్నందువల్ల తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే సమయం కూడా ఉండదు.

కాంగ్రెస్ కు తెలంగాణ విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే తమ పార్టీలోని సీమాంధ్ర నాయకులని నియంత్రించి ఉండేది. కానీ మీడియాలో తెలంగాణపై విషం కక్కుతున్న లగడపాటి, టీజీ వెంకటేశ్ వంటి నేతల నోర్లకు ఇంకా తాళాలు పడలేదంటేనే కాంగ్రెస్ ఈ కపట నాటకాన్ని కొనసాగించదల్చుకున్నదని అర్థం.

మొన్న హైదరాబాదుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కూడా రాష్ట్రాన్ని విభజించడాని, సమైక్యంగా ఉంచడానికి రెండు రోడ్డు మ్యాపులు అడగడం కాంగ్రెస్ మాయోపాయంలో భాగమే. ఒకవేళ విభజించాలనే నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానమే కనుక తీసుకోదల్చుకుంటే రెండు రోడ్డు మ్యాపులెందుకు?

వెరసి మనకు అర్థం అయ్యేదేందంటే కాంగ్రెస్ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయబోతోంది. స్థానిక సంస్థల ముందు పార్టీ నుండి టీఆరెస్ పార్టీలోకి వలసలు నిరోధించడానికి, తెలంగాణలో కదిలిపోతున్న తన పార్టీ పునాదులను నిలబెట్టుకోవడానికే ఈ తాజా నాటకం మొదలుపెట్టింది కాంగ్రెస్.

అందుకే ఈ పరీక్షా సమయంలో తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *