mt_logo

టీఆర్ఎస్ ను చూస్తే టీడీపీ, కాంగ్రెస్ కు వణుకు- హరీష్ రావు

సోమవారం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వేరుకాదు, ఒక్కటే అని ఇన్నిరోజులుగా ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం కాకుండా కాంగ్రెస్ పార్టీకి నమ్మకద్రోహం చేసిందని అనడం బాబు దివాళాకోరుతనం తెలుపుతుందని, ఒక పార్టీ విలీనం కావాలా? వద్దా? అనేది ప్రజలే నిర్ణయిస్తారని, తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అని హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ కు ఒక అస్థిత్వముందని, ఎవరో పెడితే పుట్టిందికాదని, తెలంగాణ ప్రజల హృదయాల్లో నుండి వచ్చిందని స్పష్టం చేశారు. నాలుగున్నర కోట్ల ప్రజల నవనిర్మాణానికే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే పార్టీ టీఆర్ఎస్ అని, మమ్మల్ని ఎదుర్కునే శక్తి లేక ఆ రెండు పార్టీల నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ ను చూస్తే కాంగ్రెస్, టీడీపీ లకు చెమటలు పడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రమని, ఎవరికీ సామంతరాజ్యం కాదని, టీడీపీని గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణను తాకట్టు పెడతారని, కాంగ్రెస్ ను గెలిపిస్తే డిల్లీకి తెలంగాణను తాకట్టు పెడతారని హరీష్ రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ కోసమే ఇన్నాళ్ళూ హుందాగా ఉన్నామని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ గురించి ఎవరు మాట్లాడారో, ఎవరు కొట్లాడారో ప్రజలకు తెలుసని అన్నారు. టీఆర్ఎస్ ను దొరల పార్టీ అనడం మంచిది కాదని, అమరవీరుల ఆత్మకు శాంతికలగాలని ఏనాడూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టించలేనివారు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీలతో సాధ్యం కాదని, టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *