ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైకోర్టు విభజన జరిగితేనే సంపూర్ణ తెలంగాణ వచ్చినట్లుగా భావిస్తున్నారని ఎంపీ వినోద్ అన్నారు. హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి చాలాసార్లు విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. పార్లమెంటులో, హైదరాబాద్ పర్యటనలో న్యాయశాఖ మంత్రి హైకోర్టు విభజన అంశంపై సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టుకు నూతన భవనాన్ని ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని, జూన్ 2 లోగా కొత్త హైకోర్టు ఏర్పడి అందులో ప్రాక్టీస్ చేసుకోవాలని న్యాయవాదులు భావిస్తున్నారని వినోద్ అన్నారు.
ఎంపీ కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి న్యాయశాఖలో జరిగిన అన్యాయం ఒక కారణమని, హైకోర్టు కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి ఆంధ్రా నేతల వల్ల ఏర్పడిందని అన్నారు. హైకోర్టు విభజన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోరాడుతున్నారని, ఆ ప్రయత్నం ఇప్పుడు సాకారం కాబోతోందని పేర్కొన్నారు. హైకోర్టు విభజించాలని తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడకు అందజేశామని, ప్రత్యేక హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం చూపిన భవనానికి సదానంద గౌడ అంగీకారం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అతి త్వరలోనే మన హైకోర్టు మనకు వస్తుందని, న్యాయవాదుల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కవిత స్పష్టం చేశారు.