నాంపల్లి నుమాయిష్ లో జరిగిన అగ్నిప్రమాద బాధితులందరికీ న్యాయం చేస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ప్రమాద సమాచారం అందగానే సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం, నాయకులంతా సహాయక చర్యలు చేపట్టినట్లు, ఆస్తినష్టం జరిగినా సరే ప్రాణ నష్టం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారని, వారి సూచనలతో అధికారులంతా పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రమాదాన్ని నివారించారని అన్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు దృష్ట్యా శుక్రవారం కూడా నుమాయిష్ ను మూసివేస్తున్నట్లు, శనివారం నుంచి కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఈటెల తెలిపారు.
మరోవైపు అగ్నిప్రమాద బాధితులకు భరోసా కల్పించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు బాధితులకు స్టాల్ రెంట్ ను తిరిగిచ్చే కార్యక్రమం చేపట్టారు. గురువారం మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ కార్యాలయానికి వచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ ఘటనకు కారణాలపై పోలీస్, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఎగ్జిబిషన్ లో ప్రమాద ఘటన బాధాకరమని, ఆస్తి నష్టం జరిగినా అధికారుల అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చేసుకోగలిగామన్నారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మహమూద్ అలీ తెలిపారు.