mt_logo

ఢిల్లీలో అందరి మద్దతు కూడగడుతున్న కేసీఆర్

మూడురోజుల్నించీ అన్ని పార్టీల జాతీయ నాయకులను కలిసి మద్దతు సాధించడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు కలిసిన అందరు నేతలు తెలంగాణకు అనుకూలంగా ఆమోదం తెలియచేసారు. దీంతో తెలంగాణ రాష్ట్రం వచ్చాకే తిరిగి వస్తానని కేసీఆర్ చెప్పిన మాటలు త్వరలో నిజం కానున్నాయని తెలుస్తుంది. ఆదివారం లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్ తదితరులను కలిసిన ఆయన సోమవారం ఆర్ ఎల్డీ అధినేత అజిత్ సింగ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి లను కలిశారు. ఇరు నేతలు తెలంగాణకు పూర్తి మద్దతు తెలపడంతో కేసీఆర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు మొదటినుండీ ఆర్ ఎల్డీ పార్టీ అధ్యక్షుడు అజిత్ సింగ్ మద్దతు ఇస్తూనే ఉండటం, 7సంవత్సరాల క్రితం వరంగల్ లో జరిగిన భారీ బహిరంగ సభకు కూడా హాజరయ్యారని అజిత్ సింగ్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని అన్నారని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం సురవరం సుధాకర్ రెడ్డిని కలిసి తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపాలని కేసీఆర్ కోరారు. చర్చ అనంతరం సురవరం మీడియాతో మాట్లాడుతూ, బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో ఎలాంటి గందరగోళం లేకుండా తమ డిమాండ్లను సాధించుకోవాలని సీమాంధ్ర నేతలను కోరారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంలో కృతనిశ్చయంతో ఉండాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రాబోయే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని సురవరం వ్యాఖ్యానించారు. తెలంగాణకు మద్దతు తెలిపిన సీపీఐ నేతలకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్, డీ.రాజా తో పాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *